లెఫ్టార్మ్‌ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా?

15 Jan, 2021 08:28 IST|Sakshi

300వ టెస్టు క్యాప్‌ ధరించిన నటరాజన్‌

ఒక లెఫ్టార్మ్‌ సీమర్‌గా అరుదైన ఘనత

బ్రిస్బేన్‌: టీమిండియాతో ఇక్కడ గబ్బా స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్‌(1)ని సిరాజ్‌ ఔట్‌ చేయగా, పకోవిస్కీ స్థానంలో జట్టులోకి వచ్చిన మార్కస్‌ హారిస్‌(5)ను శార్దూల్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు పంపాడు. దాంతో ఆస్ట్రేలియా 17 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతికి వార్నర్‌ క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. వార్నర్‌ ఇచ్చిన క్యాచ్‌ను రోహిత్‌ శర్మ పట్టడంతో  టీమిండియాకు శుభారంభం లభించింది. అనంతరం శార్దూల్‌ వేసిన 9 ఓవర్‌ తొలి బంతికి హారిస్‌ పెవిలియన్‌ చేరాడు. హారిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ పట్టడంతో ఆసీస్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌లు చక్కదిద్దే యత్నం​ చేస్తున్నారు. లంచ్‌ సమయానికి ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. దాంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌, హారిస్‌లు ఆరంభించగా,వారికి  ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  (ఇంత దారుణమా.. క్రికెట్‌ను చంపేశాడు!)

నటరాజన్‌@300
ఈ మ్యాచ్‌ ద్వారా నటరాజన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. భారత్‌ తరఫున 300వ టెస్టు ఆటగాడిగా నటరాజన్‌ నిలిచాడు. టెస్టుల్లో 100వ క్యాప్‌ను బాలూ గుప్తే(1960-61) ధరించగా, రెండొందలవ  టెస్టు క్యాప్‌ను నయాన్‌ మోంగియా(1993-94) ధరించాడు. ఆసీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన నటరాజన్‌కు ఎట్టకేలకు అవకాశం దక్కింది. బుమ్రా గాయం కారణంగా వైదొలగడంతో నటరాజన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. భారత్‌ తరఫున చివరిసారి ఒక లెఫ్టార్మ్‌ సీమర్‌ అరంగేట్రం చేసింది టెస్టుల్లో అరంగేట్రం​ చేసింది  2010-11 సీజన్‌లో. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఉనాద్కత్‌ అరంగేట్రం​ చేశాడు. ఆపై ఇంతకాలానికి నటరాజన్‌ ఒక లెఫ్టార్మ్‌ సీమర్‌గా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఇదిలా ఉంచితే, ఒక లెఫ్టార్మ్‌ సీమర్‌ భారత్‌ తరఫున ఆడింది మాత్రం 2013-14 సీజన్‌లో మాత్రమే. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జహీర్‌ ఖాన్‌ భారత్‌ తరఫున టెస్టుల్లో ఆడిన చివరి లెఫ్టార్మ్‌ సీమర్‌.

భారత్‌ తుది జట్టు
రహానే(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, గిల్‌, చతేశ్వర్‌ పుజారా, మయాంక్‌ అగర్వాల్‌, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్‌, టి నటరాజన్‌

ఆస్ట్రేలియా తుది జట్టు
టిమ్‌ పైన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, హారిస్‌, లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, కమిన్స్‌, స్టార్క్‌, నాథన్‌ లయన్‌, జోష్‌ హజిల్‌వుడ్‌

>
మరిన్ని వార్తలు