ఎన్‌బీఏ లీగ్‌ మళ్లీ మొదలైంది...

1 Aug, 2020 02:04 IST|Sakshi

ఫ్లోరిడా: కరోనా నేపథ్యంలో మార్చి 11న అర్ధాంతరంగా నిలిచిపోయిన అమెరికా విఖ్యాత ‘నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌ పునఃప్రారంభమైంది. ఫ్లోరిడాలోని వాల్ట్‌ డిస్నీ వరల్డ్‌ రిసార్ట్‌లో బయో సెక్యూర్‌ బబుల్‌లో శుక్రవారం జరిగిన ఈ పునఃప్రారంభ మ్యాచ్‌లో లాస్‌ ఏంజెలిస్‌ లేకర్స్‌ జట్టు 103–101తో క్లిప్పర్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌ మరో 12 సెకన్లలో ముగుస్తుందనగా స్కోరు 101–101తో సమం కాగా... లేకర్స్‌ స్టార్‌ ప్లేయర్‌ లేబ్రాన్‌ జేమ్స్‌ చివరి క్షణాల్లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 16 పాయింట్లు సాధించిన జేమ్స్‌ కీలక దశలో జట్టును ఆదుకున్నాడు.

‘ప్రపంచానికి సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేసేందుకు ఇదో మంచి అవకాశం. జాతి, రంగుతో నిమిత్తం లేకుండా ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు వివక్షకు, సామాజిక అన్యాయానికి, పోలీసుల దురాగతాలకు బలవుతున్నారని పేర్కొన్నాడు. దీన్ని రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలి’ అని జేమ్స్‌ అన్నాడు. అమెరికా నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ మృతికి సంతాపసూచకంగా మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ మోకాలిపై కూర్చోని తమ నిరసనను తెలిపారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ నినాదంతో కూడిన జెర్సీలను ధరించి బరిలోకి దిగారు. అక్టోబర్‌లో జరిగే ఫైనల్స్‌తో ఎన్‌బీఏ సీజన్‌కు తెరపడుతుంది.

మరిన్ని వార్తలు