National Games 2022: జ్యోతి పసిడి పరుగు

2 Oct, 2022 04:24 IST|Sakshi

జాతీయ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌

రజతాలు గెలిచిన జ్యోతిక, నీలం రాజు

గాంధీనగర్‌: జాతీయ క్రీడల్లో శనివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు పతకాలతో మెరిశారు. మహిళల అథ్లెటిక్స్‌ 100 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించగా... 400 మీటర్ల విభాగంలో దండి జ్యోతిక శ్రీ రజత పతకం సొంతం చేసుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌ 67 కేజీల విభాగంలో నీలం రాజు రజత పతకం దక్కించుకున్నాడు.

మరోవైపు తెలంగాణ యువ షూటర్‌ ఇషా సింగ్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెల్చు కుంది. రోలర్‌ స్కేటింగ్‌ కపుల్‌ డ్యాన్స్‌ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన అనుపోజు కాంతిశ్రీ–చలంచర్ల జూహిత్‌ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ద్వయం 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ స్కేటర్‌ ఏలూరి కృష్ణసాయి రాహుల్‌ –యాష్వి శిరీష్‌ షా జోడీ 90.8 పాయింట్లతో      బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
 
ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జ్యోతి యెర్రాజీ అదే ఉత్సాహంతో జాతీయ క్రీడల్లోనూ అదరగొట్టింది. 100 మీటర్ల రేసును జ్యోతి 11.51 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. అర్చన (తమిళనాడు; 11.55 సెకన్లు) రజతం, డియాండ్ర (మహారాష్ట్ర; 11.62 సెకన్లు) కాంస్యం సాధించారు. 400 మీటర్ల ఫైనల్‌ రేసును జ్యోతిక శ్రీ 53.30 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది.

ఐశ్వర్య మిశ్రా (మహారాష్ట్ర; 52.62 సెకన్లు) స్వర్ణం, రూపల్‌ చౌదరీ    (ఉత్తరప్రదేశ్‌; 53.41 సెకన్లు) కాంస్యం   సొంతం చేసుకున్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌ 67 కేజీల విభాగంలో నీలం రాజు మొత్తం 270 కేజీలు (స్నాచ్‌లో 124+క్లీన్‌   అండ్‌ జెర్క్‌లో 146) బరువెత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. 73 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ లిఫ్టర్‌ జె.కోటేశ్వర రావు 280 కేజీల బరువెత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. శుక్రవారం రాత్రి జరిగిన రోలర్‌ స్పోర్ట్స్‌ ఆర్టిస్టిక్‌ సింగిల్‌ ఫ్రీ స్కేటింగ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆకుల సాయిసంహిత రజతం, భూపతిరాజు అన్మిష కాంస్య పతకం సాధించారు. 

మరిన్ని వార్తలు