Kunja Rajitha: స్వర్ణం సాధించిన రజిత గురించి ఈ విషయాలు తెలుసా?

13 Oct, 2021 08:18 IST|Sakshi

Kunja Rajitha: జాతీయ ఓపెన్‌ 400 మీటర్ల అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి కుంజా రజిత స్వర్ణ పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన అండర్‌–20 మహిళల 400 మీటర్ల ఫైనల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన రజిత 56.19 సెకన్లలో అందరికంటే ముందు గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. కిరణ్‌జ్యోత్‌ (పంజాబ్‌; 57.02 సెకన్లు) రజతం, ప్రిసిలా (కేరళ; 57.54 సెకన్లు) కాంస్యం సాధించారు.

వలస వచ్చి.. 
కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ కుగ్రామం రామచంద్రాపురానికి 35 ఏళ్ల ఏళ్ల క్రితం వలసవచ్చింది కుంజా మారయ్య కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని దయనీయ స్థితి. మారయ్య- భద్రమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు ..ఇద్దరు అమ్మాయిలు.

వీరిలో ఆఖరి బిడ్డ రజిత. భర్త చనిపోవడంతో బాధ్యతంతా భద్రమ్మపై పడింది. ఆమె అడవికి వెళ్లి కట్టెలు సేకరించడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తోంది. ఇక... రజిత రోజూ చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి విద్యనభ్యసించేది. 1 నుంచి 8వ తరగతి వరకు అక్కడ చదువుకుంది. సెలవులు ఉన్నప్పుడు తల్లి వెంట కట్టెలు తెచ్చి చేదోడు వాదోడుగా నిలిచేది. పరుగులో తొలినుంచి రజితలోని వేగాన్ని ఆమె పెద్దన్న జోగయ్య గమనించాడు.  

ఆగని పరుగు.. 
ఈ క్రమంలో... నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 తరగతులు చదివింది. అప్పుడే నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్‌ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్‌ శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీడియెట్‌ చదువుతూ గుంటూరులో శాప్‌ ద్వారా గురువులు కృష్ణమోహన్, మైకె రసూల్‌ వద్ద అథ్లెటిక్స్‌ శిక్షణ తీసుకుంది. 2019లో అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్‌ పోటీల్లో 400 మీటర్లు పరుగు విభాగంలో విశేష ప్రతిభ కనబర్చింది. ఇప్పుడు జాతీయ ఓపెన్‌ 400 మీటర్ల అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసింది.

చదవండి: DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు?
T20 World Cup 2021: టీమిండియా నెట్‌ బౌలర్‌గా ఆవేశ్‌ఖాన్

మరిన్ని వార్తలు