‘అర్జున’ ఒక్కరికే వస్తుందనుకున్నా...

20 Aug, 2020 06:49 IST|Sakshi

భారత డబుల్స్‌ షట్లర్‌ సాత్విక్‌

హైదరాబాద్‌: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసిన జాతీయ క్రీడా పురస్కారాల్లో ‘అర్జున అవార్డు’ కోసం తనతోపాటు తన భాగస్వామి చిరాగ్‌ శెట్టి పేరు కూడా ఉండటంపై ఆంధ్రప్రదేశ్‌ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 2019లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర) జంట ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సర్క్యూట్‌లో అద్భుత ఫలితాలు సాధించింది.

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–500 టోర్నీలో టైటిల్‌ నెగ్గిన ఈ ద్వయం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ క్రమంలో పురుషుల డబుల్స్‌ ప్రపంచ చాంపియన్‌ జోడీని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న జంటను సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఓడించింది. ‘చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరిలో ఒక్కరికే అవార్డు వచ్చే అవకాశముందని, ఇద్దరికీ రాకపోవచ్చని ఎవరో చెప్పారు.

అయితే అవార్డుల సెలక్షన్‌ కమిటీ మా ఇద్దరి పేర్లను కేంద్ర క్రీడా శాఖకు పంపించడంతో ఊరట చెందాను’ అని సాత్విక్‌ అన్నాడు. ప్రస్తుతం అమలాపురంలోనే ప్రాక్టీస్‌ చేస్తున్నానని తెలిపిన సాత్విక్‌... రెండు వారాలలోపు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో జరుగుతున్న జాతీయ శిక్షణ శిబిరానికి హాజరవుతానన్నాడు. . తన అర్జున అవార్డును తల్లిదండ్రులకు, కోచ్‌లకు, తానీ స్థాయికి చేరుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ అంకితం ఇస్తున్నానని ప్రపంచ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్‌ తెలిపాడు.

20 ఏళ్ల ప్రాయంలోనే ‘అర్జున’ అవార్డు వస్తుందని ఊహించలేదని... ఈ పురస్కారంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సాత్విక్‌ పేర్కొన్నాడు. ‘టోక్యో ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తీవ్రంగా నిరాశ చెందాను. కొంతకాలంగా మేమిద్దరం మంచి ఫామ్‌లో ఉన్నాం. మరో రెండు నెలల వరకు ఎలాంటి అంతర్జాతీయ టోర్నీలు లేవు. టోర్నీలు లేని సమయంలో ఏ క్రీడాకారుడికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన రెండు వారాల్లో మేము ఫామ్‌లోకి వస్తామని ఆశిస్తున్నాను’ అని సాత్విక్‌ వివరించాడు.

మరిన్ని వార్తలు