#Kohli- Naveen-ul-Haq: గంభీర్‌ ఓ లెజెండ్‌.. దేశం మొత్తం ఆయనను గౌరవిస్తుంది.. మైదానంలో

25 May, 2023 14:38 IST|Sakshi
గౌతం గంభీర్‌తో నవీన్‌-ఉల్‌-హక్ (PC: IPL/LSG)

IPL 2023- Naveen-ul-Haq- Gautam Gambhir: ‘‘గంభీర్‌ ఓ దిగ్గజ క్రికెటర్‌. ఇండియా మొత్తం ఆయనను గౌరవిస్తుంది. భారత క్రికెట్‌కు ఆయన ఎనలేని సేవ చేశాడు. మెంటార్‌గా, కోచ్‌గా, క్రికెట్‌ లెజెండ్‌గా ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కెరీర్‌లో ఎలా ముందుకు సాగాలో ఎన్నో సూచనలు ఇచ్చారు. 

మైదానం లోపల, వెలుపలా ఎలా ఉండాలో నేర్పించారు’’ అని లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌, అఫ్గనిస్తాన్‌ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ దిగ్గజ ఆటగాడని, అతడి మార్గనిర్దేశనంలో అనేక విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. 

తొలి సీజన్‌లోనే
ఐపీఎల్‌-2023తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన నవీన్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో లక్నో తరఫున అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌లో మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడిన నవీన్‌ 11 వికెట్లు పడగొట్టాడు. ఇక బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసి 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

కోహ్లితో వాగ్వాదంతో ఒక్కసారిగా
చెన్నై మ్యాచ్‌లో నవీన్‌ మెరుగ్గా రాణించినప్పటికీ లక్నో 81 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఆట కంటే కూడా టీమిండియా స్టార్‌, ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితో వాగ్వాదం, తదనంతరం కోహ్లిని ఉద్దేశించి చేసిన సోషల్‌ మీడియా పోస్టులతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు.

ఇక ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లితో వాగ్వాదం సమయంలో నవీన్‌కు గంభీర్‌ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరిని కోహ్లి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు. అంతేకాదు.. నవీన్‌ బౌలింగ్‌ చేయడానికి వచ్చిన ప్రతిసారి కోహ్లి నామస్మరణతో స్టేడియాన్ని హోరెత్తించారు.

గంభీర్‌ లెజెండ్‌.. ఎన్నో విషయాలు నేర్చుకున్నా
ఈ నేపథ్యంలో కింగ్‌ అభిమానులు అలా చేయడాన్ని ఆస్వాదిస్తానన్న నవీన్‌.. గంభీర్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. గంభీర్‌ తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచాడని పేర్కొన్నాడు. ఈ మేరకు ముంబైతో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ మెంటార్‌, కోచ్‌ .. ప్లేయర్‌ ఎవరైనా గానీ.. ఎవరికైనా గానీ నా వంతు సాయం చేయాల్సి వచ్చినపుడు నేను వెనకడుగు వేయను. 

అలాగే ఇతరుల నుంచి అదే ఎక్స్‌పెక్ట్‌ చేస్తా. గంభీర్‌ నాకు ఎన్నో విషయాలు నేర్పించారు’’ అని నవీన్‌ ఉల్‌ హక్‌ తెలిపాడు. కాగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిన లక్నో తమ రెండో సీజన్‌ను కూడా నాలుగో స్థానంతో ముగించింది. మరోవైపు.. లక్నోపై గెలిచిన ముంబై క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.

చదవండి: IPL 2023: ముంబై గెలిచిందా సరికొత్త చరిత్ర.. టైటిల్‌ నెగ్గే విషయంలో కాదు..!
#MI: క్వాలిఫయర్‌-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే!


  

మరిన్ని వార్తలు