Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్‌' కోహ్లి ఒక్కడే..

15 Oct, 2022 11:22 IST|Sakshi

కింగ్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేక​ంగా చెప్పనవసరం లేదు. 33 ఏళ్ల వయసులోనూ సూపర్‌ ఫిట్‌గా కనిపిస్తున్న కోహ్లి గాయపడడం చాలా అరుదు. తనకు తానుగా విశ్రాంతి కోరుకుంటే తప్ప టీమిండియాకు ఎప్పుడు దూరం కాలేదు. ఫామ్‌ లేమి సమస్యలతో గడ్డుకాలం చూసిన కోహ్లి ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఏనాడు ఇబ్బంది పడింది లేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత జట్టులోని వార్షిక కాంట్రాక్టు కలిగి ఉన్న 23 మంది జాతీయ ఆటగాళ్లు 2021-22 సీజన్‌లో వివిధ గాయాలు, సమస్యల కారణంగా ఎన్‌సీఏ అకాడమీలో చికిత్స తీసుకున్నారు. ఈ లిస్ట్‌లో కోహ్లి పేరు ఎక్కడా కనిపించలేదు.. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తాడనేది. బీసీసీఐ సీఈవో హేమంగ్ అమిన్ వెల్లడించిన నివేదికలో ఈ విషయం బయటపడింది.

మొత్తం 70 మంది ఆటాగాళ్లకు సంబంధించి 96 గాయాలకు ఎన్‌సీఏ వైద్య బృందం చికిత్స చేసిందని నివేదికలో హేమన్ అమీన్ పేర్కొన్నారు. ఇందులో 96 గాయాలకు సంబంధించి ఆటగాళ్లకు ఎన్సీఏలో చికిత్స జరిగిందని తెలిపారు. 70 మంది ఆటగాళ్లలో 23 మంది సీనియర్ ఇండియా ప్లేయర్లు కాగా. 25 మంది భారత్ ఏ టీమ్ తదితర క్రికెటర్లు, ఒకరు అండర్-19, ఏడుగురు సీనియర్ మహిళలు, 14 మంది రాష్ట్రాల ఆటగాళ్లు ఉన్నారని తెలిపారు.

టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్,కేఎల్ రాహుల్, పుజారా, ధావన్, హార్దిక్, ఉమేశ్, జడేజా, పంత్, శ్రేయాస్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్, చాహల్, సుందర్, కుల్దీప్, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్ తదితర ఆటగాళ్లు ఎన్సీఏలో చికిత్స తీసుకుని కోలుకున్నారు.కానీ కోహ్లి మాత్రం ఈ ఏడాది ఒక్కసారి గాయపడడం లేదా ఫిట్‌నెస్‌ సమస్యలతో ఎన్‌సీఏకు రాలేదని హేమంగ్‌ అమిన్‌ పేర్కొన్నాడు.

ఇక ఎన్‌సీఏలో చికిత్స తీసుకున్న మిగతా క్రికెటర్లలో శుబ్‌మన్ గిల్, పృథ్వీషా, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్, కేఎస్ భరత్, నాగర్‌కోటి, సంజూశాంసన్, ఇషాన్ కిషన్, కార్తిక్ త్యాగి, నవదీప్ సైని, రాహుల్ చాహర్ తదితరులు ఉన్నారు. ఇక 2018లో విరాట్ కోహ్లి వెన్నునొప్పి కారణంగా కౌంటీల్లో ఆడలేకపోయాడు. ఆ ఇబ్బందిని అధిగమించిన రన్‌మెషిన్ అప్పటి నుంచి ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిస్తూనే తన ఆటను కొనసాగిస్తూ వస్తున్నాడు.

చదవండి: జరగాలని రాసిపెట్టుంటే స్టోక్స్‌ ఏం చేయగలడు!

మరిన్ని వార్తలు