T20 WC 2022 Paul Van Meekeren: క్రికెట్‌ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు

28 Oct, 2022 15:12 IST|Sakshi

క్రికెట్‌ను విపరీతంగా ఆదరించే టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లో పుట్టిన ఆటగాళ్లకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ టోర్నీలో అవకాశాలు రాకపోయినప్పటికి దేశవాలీ టోర్నీలు వారి ఆకలి బాధలు తీర్చడంతో పాటు డబ్బుల సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఐపీఎల్‌ పుణ్యమా అని భారత్‌లో అంతగా పాపులర్‌ కానీ క్రికెటర్లు కూడా కోటీశ్వరులుగా మారిపోతున్నారు. కానీ నెదర్లాండ్స్‌ లాంటి చిన్న జట్లకు ఆ అవకాశం ఉండదు. 

ఐసీసీ లాంటి మేజర్‌ టోర్నీలు తప్ప వారికి పెద్దగా మ్యాచ్‌లు ఉండవు. ఇలాంటి మేజర్‌ టోర్నీల్లో క్వాలిఫయింగ్‌ అయితే ఇంకా గొప్ప. నెదర్లాండ్స్‌ మాత్రమే కాదు.. స్కాట్లాండ్‌, నమీబియా, యూఏఈ లాంటి దేశాల్లో క్రికెట్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయినా క్రికెట్‌పై ఉండే ఇష్టంతో ఆ దేశాలకు చెందిన వారు క్రికెటర్లుగా మారి ఆడుతున్నారు. అయితే క్రికెటర్‌గా మారిన ప్రతీ వ్యక్తి జీవితం ఒకేలా ఉండదు. 

కొందరు క్రికెట్‌ ఆడకపోయినా వేరే వ్యాపారాలు.. లేదంటే ఎక్కడైనా వర్క్‌ చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. కొందరు మాత్రం క్రికెట్‌పైనే ప్రాణం పెట్టుకుంటారు. ఆ కొందరిలో ఒకడు నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ పాల్‌ వాన్‌ మీకెరెన్‌. ఈ పేరు పెద్దగా ఎవరికి పరిచయం లేకపోవచ్చు. కానీ గురువారం టీమిండియాతో ఆడిన మ్యాచ్‌లో ఈ నెదర్లాండ్స్‌ బౌలర్‌ కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ దక్కించుకొని గుర్తింపు పొందాడు.

అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు నుంచి చూస్తే మీకెరెన్‌ జీవితం బయటపడుతుంది.క్రికెట్‌ను అమితంగా ప్రేమించే పాల్‌ వాన్‌ మీకెరెన్‌  ఆట ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు ఉండాల్సిందే. ఆటపై పెంచుకున్న ఇష్టంతో 2013లో నెదర్లాండ్స్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు పాల్‌ వాన్‌ మీకెరెన్‌. మేటి క్రికెటర్‌గా రాణించాలని కలలు గన్న మీకెరెన్‌ జీవితాన్ని కరోనా అతలాకుతలం చేసింది. కరోనా దెబ్బకు మ్యాచ్‌లు లేకపోవడంతో పాల్‌ కుటుంబం రోడ్డుపై పడింది. 

ఒకపూట తిండి తినడానికి కష్టంగా మారడంతో క్రికెట్‌ బ్యాట్‌ను వదిలి ఆటో డ్రైవర్‌గా మారాడు. తన కుటుంబాన్ని పోషించడం కోసం ఉబెర్‌ ఈట్స్‌ ఫుడ్‌ డెలివరీ డ్రైవర్‌గా ఉద్యోగం చేశాడు. అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తనకు ఇష్టం లేని పనిని వదిలేసి ఎంత కష్టమైనా సరే కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు వెళ్లాడు. అలా కౌంటీ క్రికెట్‌లో మెరిసిన మీ​కెరెన్‌ తనను తాను నిరూపించుకున్నాడు. అటుపై కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన తొలి డచ్‌ క్రికెటర్‌గా పాల్‌ వాన్‌ మీకెరెన్‌ పేరు పొందాడు.

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పూర్తయ్యాకా తన జట్టుతో కలిసిన మీకెరెన్‌ టి20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. నెదర్లాండ్స్‌ ఇవాళ సూపర్‌-12 చేరడంలో మీకెరెన్‌ కీలకపాత్ర పోషించాడు. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన పాల్‌ వాన్‌ మీకెరెన్‌కు.. భారత్‌తో మ్యాచ్‌ ఆడడం ఒక కల. అదృష్టవశాత్తూ అతనికి టీమిండియాతో మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. మ్యాచ్‌ ఓడిపోయినప్పటికి కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ తీసిన పాల్‌ వాన్‌ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే ఇండియా లాంటి దేశంతో క్రికెట్‌ ఆడడం జీవితంలో మరిచిపోలేని అనుభుతి అని పాల్‌ వాన్‌ మీకెరెన్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: పాక్‌ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ఈసారైనా మోసం చేయకండి! ఈ మిస్టర్‌ బీన్‌ గోలేంటి?

Poll
Loading...
మరిన్ని వార్తలు