ICC ODI Super League: అందరూ చేతులెత్తేసినా.. ఆ ఒక్కడు నిలబడ్డాడు! విండీస్‌దే సిరీస్‌

3 Jun, 2022 13:21 IST|Sakshi

ICC ODI Super League Netherlands Vs West Indies: ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకుంది. విండీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన బ్రాండన్‌ కింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అమ్‌స్టెల్వీన్‌లోని వీఆర్‌ఏ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు విక్రమ్‌జిత్‌ సింగ్‌(46), మాక్స్‌ ఒడౌడ్‌(51) రాణించారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎడ్‌వర్డ్స్‌ 68 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితం అయ్యారు. 

ఇక మొదటి వన్డేలో అద్భుత అర్థ శతకంతో ఆకట్టుకున్న తేజ నిడమనూరు 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో  214 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో రాణించిన షాయీ హోప్‌ను 18 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు నెదర్లాండ్స్‌ బౌలర్‌ బాస్‌ డీ లీడ్‌.

ఇక బ్రూక్స్‌ సైతం కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. బానర్‌ (15), కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (10) పూర్తిగా నిరాశ పరిచారు. దీంతో విజయంపై నెదర్లాండ్స్‌కు ఆశలు చిగురించాయి. అయితే, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రాండన్‌ కింగ్‌ 90 బంతుల్లో 91 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు(వన్డేల్లో కింగ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం). కేసీ కార్టీ కూడా 43 పరుగులతో అతడికి సహాయంగా నిలబడ్డాడు.

వీరిద్దరి ఇన్నింగ్స్‌ కారణంగా విండీస్‌ మరో ఐదు వికెట్లు చేతిలో ఉండగానే విజయం సొంతం చేసుకుంది. సిరీస్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ పర్యటనతో వెస్టిండీస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నికోలస్‌ పూరన్‌ బ్యాటర్‌గా విఫలమైనా.. సారథిగా ఆకట్టుకున్నాడు. 

నెదర్లాండ్స్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే స్కోర్లు:
నెదర్లాండ్స్‌: 214 (48.3)
వెస్టిండీస్‌: 217/5 (45.3) 
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: బ్రాండన్‌ కింగ్‌

ఇది చదవండి:  ICC ODI Super League: చెలరేగిన తేజ నిడమనూరు.. అయినా వెస్టిండీస్‌ చేతిలో తప్పని ఓటమి!
Who Is Teja Nidamanuru: అరంగేట్రంలోనే అర్థ శతకంతో మెరిసి.. ఎవరీ తేజ నిడమనూరు?

మరిన్ని వార్తలు