Neeraj Chopra: ఎదురులేని నీరజ్‌ చోప్రా.. పట్టిందల్లా బంగారమే

9 Sep, 2022 07:18 IST|Sakshi

భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రాకు ఎదురులేకుండా పోతుంది. అతను ఏం పట్టినా బంగారమే అవుతుంది. తాజాగా ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజయం సాధించిన నీరజ్‌ చోప్రా ట్రోఫీని ఎగురేసుకుపోయాడు. భారత కాలమాన ప్రకారం జ్యూరిచ్‌ వేదికగా గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన గేమ్‌లో నీరజ్‌ చోప్రా రెండో ప్రయత్నంలో ఈటెను 88.34 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు.

అతనికి పోటీగా ఉన్న ఐదుగురు కనీసం దరిదాపులోకి కూడా రాలేకపోయారు. దీంతో ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ట్రోఫీ నీరజ్‌ సొంతమైంది. ఇక గేమ్‌ విషయానికి వస్తే.. తొలి ప్రయత్నంలో నీరజ్‌ చోప్రా ఫౌల్‌ చేసి డిస్‌క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో​ 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు. అయితే నీరజ్‌తో పాటు ఉన్న మిగతా ఐదుగురు వేగాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు. 

ఇక 2017, 2018 డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ మీట్‌కు నీరజ్‌ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్‌ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు.  

>
మరిన్ని వార్తలు