స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రాకు తీవ్ర జ్వరం

14 Aug, 2021 17:15 IST|Sakshi

చండీగఢ్‌: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా వైరస్‌ సోకిందేమోనని అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నీరజ్‌కు పరీక్షలు చేయగా నెగటివ్‌ తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

హరియాణాకు చెందిన నీరజ్‌ చోప్రా జావెలన్‌ త్రోయర్‌లో స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు. స్వదేశానికి వచ్చిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. స్వరాష్ట్రం హరియాణా రూ.6 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అయితే ఒలింపిక్స్‌లో సత్తా చాటిన తమ క్రీడాకారులను శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వాస్తవంగా నీరజ్‌ హాజరు కావాల్సింది. కానీ తీవ్ర జ్వరం కారణంగా ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యాడు. 

వైద్యుల సూచనల మేరకు నీరజ్‌ ఇంట్లోనే ఉంటున్నాడని సమాచారం. శుక్రవారం 103 డిగ్రీల ఉష్ణోగ్రత నీరజ్‌కు ఉంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్‌ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో జ్వరం బారినపడ్డాడని అతడి సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు. జ్వరం కారణంగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు నీరజ్‌ చోప్రా దూరంగా ఉండనున్నాడు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు