Neeraj Chopra: నీరజ్‌ చోప్రా 'రజతం'.. డ్యాన్స్‌తో ఇరగదీసిన కుటుంబసభ్యులు

24 Jul, 2022 19:58 IST|Sakshi

భారత ​స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో నీరజ్‌ చోప్రా స్వస్థలమైన హర్యానాలోని పానిపట్‌ కేంద్రంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నీరజ్‌ పతకం సాధించాడని తెలియగానే అతని కుటుంబసభ్యులు, బంధు మిత్రులు మిఠాయిలు పంచుకొని బాణసంచాలు కాల్చారు. అనంతరం డ్యాన్స్‌లతో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఏఎన్‌ఐ ట్విటర్‌లో షేర్‌ చేయగా క్షణాల్లో వైరల్‌గా మారింది. 

ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌ చోప్రా.. నాలుగో ప్రయత్నంలో ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రజతం కొల్లగొట్టాడు. తద్వారా 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. 2003 వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో లాంగ్‌ జంప్‌ విభాగంలో భారత మహిళా అథ్లెట్‌ అంజూ బాబీ జార్జీ కాంస్యం గెలుచుకుంది. అప్పటి నుంచి భారత్‌కు అథ్లెటిక్స్‌ విభాగంలో పతకం రాలేదు. తాజాగా నీరజ్‌ చోప్రా వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.

గ్రెనేడియన్ జావెలిన్ త్రోయర్ అండర్సన్ పీటర్స్ 90.54 దూరం విసిరి స్వర్ణం సాధించగా.. 88.09 మీటర్లతో జాకుబ్ వడ్లేజ్ కాంస్యం గెలుచుకున్నాడు. కాగా భారత్‌కు చెందిన మరో అథ్లెట్‌ రోహిత్‌ యాదవ్‌ ఫైనల్లో నిరాశపరిచాడు. తన మూడో ప్రయత్నంలో ఈటెను 78.72 మీటర్ల దూరం విసిరిన రోహిత్‌ ఓవరాల్‌గా 10వ స్థానానికి పరిమితమయ్యాడు.

చదవండి: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు

మరిన్ని వార్తలు