పాక్‌ అథ్లెట్‌పై ట్యాంపర్‌ ఆరోపణలకు చెక్‌ పెట్టిన స్వర్ణ పతక విజేత

26 Aug, 2021 21:24 IST|Sakshi

న్యూఢిల్లీ: పాక్‌ జావెలిన్‌ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్​.. తన జావెలిన్​ను ట్యాంపర్​ చేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నీరజ్​ చోప్రా స్పందించాడు. ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ.. అతను ట్విటర్లో​ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. అందులో అతను మాట్లాడుతూ.. దయచేసి నన్ను, నా కామెంట్లను వ్యక్తిగత ఎజెండాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశాడు. క్రీడాకారుల మధ్య  ఎటువంటి వైరుధ్యాలు ఉండవని,  దేశాలు, ప్రాంతాలకు అతీతంగా క్రీడలు​ అందరినీ ఏకం చేస్తాయని పేర్కొన్నాడు. 

ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కొంత మంది నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా దుమారం రేపుతున్నారని, వారి కామెంట్లు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయని, అలాంటి వాటిని నిజమైన భారతీయులు పట్టించుకోవద్దని కోరాడు. నదీమ్‌ నా జావెలిన్‌ను పట్టుకోవడం పొరపాటుగా జరిగి ఉంటుందని, ఇందులో అతను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పేమీ ఉండదని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. 

కాగా, కీలకమైన ఫైనల్​కు ముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధంచిన వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో నీరజ్‌ స్పందించాల్సి వచ్చింది. ఆ వీడియోలో పాక్‌ అథ్లెట్‌ అర్షద్​ నదీమ్ నీరజ్​ చోప్రా జావెలిన్‌ను పట్టుకొని తిరగడం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో నదీమ్​.. నీరజ్​ జావెలిన్​ను ట్యాంపర్​ చేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్‌ 2020లో ఫైనల్లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ను 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్​లో భారత్​ 100 ఏళ్ల స్వర్ణ పతక నిరీక్షణకు తెరదించాడు. 
చదవండి: పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు

మరిన్ని వార్తలు