Neeraj Chopra: భారత్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రాకు తప్పిన పెను ప్రమాదం

19 Jun, 2022 10:36 IST|Sakshi

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌.. ఒలింపియన్‌ నీరజ్‌ చోప్రాకు పెను ప్రమాదం తప్పింది. ఫిన్‌లాండ్‌లో శనివారం జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నీరజ్‌ చోప్రా ఈ గేమ్‌లో జావెలిన్‌ త్రోయింగ్‌ ప్రయత్నాల్లో రెండుసార్లు ఫౌల్‌ చేశాడు. ఈ క్రమంలోనే జావెలిన్‌ త్రో విసరగానే పట్టు తప్పిన నీరజ్ జారి కిందపడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ నీరజ్‌కు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. కిందపడిన నీరజ్‌ పైకిలేచి తాను బాగానే ఉన్నానంటూ చిరునవ్వుతో సంకేతాలు ఇవ్వడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా అంతకముందే భారీ వర్షం పడడంతో గ్రౌండ్‌ మొత్తం బురదమయమయింది. వర్షం ముగిసిన వెంటనే ఆటను ప్రారంభించారు. ఆటలో మొదటగా నీరజ్‌ చోప్రానే జావెలిన్‌ త్రో విసిరాడు.  టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇది ఆయనకు రెండో పోటీ. ఇక్కడ నీరజ్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. నీరజ్ తర్వాత వాల్‌కాట్ 86.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. పీటర్స్ 84.75 ఉత్తమ ప్రయత్నంతో మూడో స్థానంలో నిలిచాడు.

అదే విధంగా చోప్రాతో పాటు కుర్టానే ఒలింపిక్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న  ప్రపంచ పారి జావెలిన్ ఛాంపియన్ సందీప్ చౌదరి కూడా పోటీలో పాల్గొని 60.35 మీటర్ల బెస్ట్ త్రోతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్‌ పది నెలల తర్వాత ఇటీవల పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడు. ఈ గేమ్స్‌లో నీరజ్‌ ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు.   

చదవండి: Neeraj Chopra: స్వర్ణం నెగ్గిన నీరజ్‌ చోప్రా

Katherine Brunt: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌ గుడ్‌బై

మరిన్ని వార్తలు