ICC WC Qualifier: డక్‌వర్త్‌ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌కు అర్హత

16 Mar, 2023 21:26 IST|Sakshi

నేపాల్‌ క్రికెట్‌ జట్టుకు డక్‌వర్త్‌ లూయిస్‌ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఐసీసీ వరల్డ్‌కప్‌ క్వాలియర్‌కు అర్హత సాధించాలంటే యూఏఈతో మ్యాచ్‌లో నేపాల్‌కు విజయం తప్పనిసరి అయింది. అయితే తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ ఆసిఫ్‌ ఖాన్‌ 42 బంతుల్లోనే 101 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో భారీ స్కోరు చేసింది. అర్వింద్‌ 94 పరుగులు చేయగా.. కెప్టెన్‌ ముహ్మద్‌ వసీమ్‌ 63 పరుగులతో రాణించడంతో యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. 

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌ వర్షం అంతరాయం కలిగించే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిని అమలు చేశారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం నేపాల్‌ జట్టు చేయాల్సినదానికన్నా తొమ్మిది పరుగులు ఎక్కువగా చేయడంతో ఆ జట్టు గెలిచినట్లు ప్రకటించారు. బీమ్‌ షార్కీ 67 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. ఆరిఫ్‌ షేక్‌ 52, గుల్షన్‌ జా 50 నాటౌట్‌, కుషాల్‌ బుర్తెల్‌ 50 పరుగులు రాణించారు.

ఈ మ్యాచ్‌కు ముందు నేపాల్‌ నాలుగో స్థానంలో ఉండగా.. యూఏఈ ఆరో స్థానంలో ఉంది. ఇప్పటికే స్కాట్లాండ్‌, ఒమన్‌లు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. తాజాగా డక్‌వర్త్‌ లుయీస్‌ పద్దతిలో యూఏఈపై విజయం సాధించిన నేపాల్‌ మూడో స్థానానికి చేరుకొని మూడో జట్టుగా 2023 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఇక జింబాబ్వే వేదికగా జూన్‌లో ఐసీసీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ పోటీలు జరగనున్నాయి. 

ఇక ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో టీమిండియా అర్హత దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లు తాము ఆడే వన్డే సిరీస్‌ల్లో విజయాల ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది. 

చదవండి: క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా

సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్‌ 148

మరిన్ని వార్తలు