నేత్ర... కొత్త చరిత్ర

8 Apr, 2021 06:00 IST|Sakshi

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా సెయిలర్‌గా రికార్డు

న్యూఢిల్లీ: సెయిలింగ్‌ క్రీడాంశంలో ఇప్పటివరకు భారత్‌ నుంచి తొమ్మిది మంది ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్నారు. అయితే వారందరూ పురుషులే. కానీ మహిళల విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి భారతీయ సెయిలర్‌గా తమిళనాడుకు చెందిన నేత్రా కుమనన్‌ బుధవారం రికార్డు సృష్టించింది. చెన్నైకి చెందిన 23 ఏళ్ల నేత్ర ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లో లేజర్‌ రేడియల్‌ క్లాస్‌ ఈవెంట్‌లో పోటీపడుతోంది. బుధవారం రేసులు ముగిశాక 21 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో ఉంది. గురువారం జరిగే చివరి రోజు రేసుల తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేత్రకు ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారైంది.

‘మరో రేసు మిగిలి ఉండగానే నేత్ర కుమనన్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. గురువారం చివరి రేసు 20 పాయింట్లతో జరగనుంది. అయితే సమీప ప్రత్యర్థిపై నేత్ర 21 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో బుధవారమే ఆమెకు ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయమైంది’ అని ఆసియా సెయిలింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు మాలవ్‌ ష్రాఫ్‌ తెలిపారు. ఇప్పటివరకు భారత్‌ నుంచి సోలీ కాంట్రాక్టర్, బాసిత్‌ (1972 మ్యూనిక్‌), ధ్రువ్‌ భండారి (1984 లాస్‌ ఏంజెలిస్‌), కెల్లీ రావు (1988 సియోల్‌), ఫారూఖ్‌ తారాపూర్, సైరస్‌ కామా (1992 బార్సిలోనా), మాలవ్‌ ష్రాఫ్, సుమీత్‌ పటేల్‌ (2004 ఏథెన్స్‌), నచ్తార్‌ సింగ్‌ జోహల్‌ (2008 బీజింగ్‌) సెయిలింగ్‌లో ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు