T20 WC 2022: 'కొంచెం హుందాగా ప్రవర్తించండి'.. సెహ్వాగ్‌, పార్థివ్‌లకు చురకలు

28 Oct, 2022 21:30 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. అందులో ఒకటి అఫ్గానిస్తాన్‌, ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌. కనీసం టాస్‌ కూడా పడకుండా మ్యాచ్‌ రద్దు కావడం సగటు అభిమానికి బాధ కలిగించింది. అఫ్గానిస్తాన్‌ ఈసారి నేరుగా టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. ఐర్లాండ్‌ మాత్రం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఆడింది. క్వాలిఫయింగ్‌లో స్కాట్లాండ్‌ను ఓడించిన ఐర్లాండ్‌.. రెండుసార్లు టి20 ప్రపంచ చాంపియన్‌ అయిన విండీస్‌కు గట్టిషాక్‌ ఇచ్చింది. గ్రూఫ్‌ టాపర్‌గా సూపర్‌-12కు అర్హత సాధించింది.

సూపర్‌-12లో ఇంగ్లండ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో ఓడించిన ఐర్లాండ్‌.. లంక చేతిలో మాత్రం ఓడిపోయింది. ఇక అఫ్గానిస్తాన్‌ పరిస్థితి దారుణం. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు రద్దు కాగా.. ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ రెండు జట్లు సెమీస్‌ చేరడం కష్టమే. అయితే ఐర్లాండ్‌కు కాస్త అవకాశం ఉంది.

ఈ సంగతి పక్కనపెడితే టీమిండియా మాజీలు వీరేంద్ర సెహ్వాగ్‌, పార్థివ్‌ పటేల్‌లకు ఒక క్రికెట్‌ అభిమాని చురకలంటించాడు. అఫ్గానిస్తాన్‌, ఐర్లాండ్‌లను సభ్య దేశాలుగా పేర్కొనడంతోనే ఈ తంటంతా వచ్చి పడింది. విషయంలోకి వెళితే.. శుక్రవారం అఫ్గానిస్తాన్‌, ఐర్లాండ్‌ ప్రీ మ్యాచ్‌ షోలో వీరేంద్ర సెహ్వాగ్‌, పార్ధివ్‌ పటేల్‌లు పాల్గొన్నారు. మాటల్లో అఫ్గానిస్తాన్‌, ఐర్లాండ్‌లను వీరిద్దరు సభ్య దేశాలుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఇరుజట్లు ఐసీసీలో శాశ్వత జట్లుగా ఎప్పుడో గుర్తింపు పొందాయి. అటు ఆఫ్గన్‌.. ఇటు ఐర్లాండ్‌కు టెస్టు సభ్యత్వం కూడా ఉంది. ఈ విషయం మరిచిపోయి వాటిని సభ్య దేశాలు అనడం ఒక అభిమానికి చిరాకు తెప్పించింది. వెంటనే సోషల్‌ మీడియా వేదికగా సెహ్వాగ్‌, పార్థివ్‌ పటేల్‌కు చురకలంటించాడు. ''కొంచెం హుందాగా ప్రవరిస్తే మంచిది..'' అంటూ కామెంట్‌ చేశాడు.

ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో సగం మ్యాచ్‌లు వర్షార్పణం అవడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడే సమయంలో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌ ఎలా నిర్వహిస్తారంటూ ఐసీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. అదేంటో గానీ ఈ వరల్డ్‌కప్‌లో వర్షం కూడా ఒక టీమ్‌లా తయారైంది. ఈసారి గట్టిగా కురుస్తూ మ్యాచ్‌లను రద్దు చేసే పనిలో పడింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో పాయింట్ల పట్టికలో వరుణుడు టాప్‌లో ఉన్నట్లు అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ‘భారత్‌పై గెలిస్తే నవ్వుకుంటారుగా.. అంత ఏడుపు ఎందుకులే..’

Poll
Loading...
మరిన్ని వార్తలు