డుప్లెసిస్‌ డ్రింక్స్‌ మోయలేదా?

22 Oct, 2020 17:49 IST|Sakshi
ఇమ్రాన్‌ తాహీర్‌(ఫైల్‌ఫోటో)

ఎవరు ఏది చేసినా జట్టు కోసమే

సీఎ​స్‌కే ఇచ్చే రెస్పెక్ట్‌ ఎక్కడా చూడలేదు: తాహీర్‌

దుబాయ్‌:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే కథ దాదాపు ముగిసినట్లే. ఇప్పటికే 10 మ్యాచ్‌లాడి ఏడు పరాజయాలను చూసిన సీఎస్‌కే ప్లేఆఫ్‌ రేసులో ఉండే అవకాశం ఎలా చూసినా కనబడుటం లేదు. ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచినా సీఎస్‌కేకు అవకాశం ఉండకపోవచ్చు. ప్రధానం సీఎస్‌కే జట్టులో ఉన్న స్వదేశీ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చకపోవడంతోనే ఆ జట్టు దారుణంగా డీలా పడిందనేది వాస్తవం. ఇక విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నా తుది జట్టులో ఉండేది నలుగురు మాత్రమే కావడంతో ఇమ్రాన్‌ తాహీర్‌కు సైతం అవకాశం దక్కలేదు.

వాట్సన్‌, డుప్లెసిస్‌, బ్రేవో, సామ్‌ కరాన్‌లకే  పెద్ద పీట వేయడంతో తాహీర్‌ ప్రేక్షకపాత్రకే పరిమితం అయ్యాడు. ఆల్‌ రౌండర్ల కోటాలో కరాన్‌ వైపే ధోని మొగ్గుచూపడంతో తాహీర్‌కు మొండిచేయి ఎదురైంది. గతేడాది 26 వికెట్లతో పర్పుల్‌ క్యాప్‌ను అందుకున్న బౌలర్‌ తాహీర్‌ కూడా రిజర్వ్‌ బెంచ్‌లో పెట్టడాన్ని చాలామంది ప్రశ్నించారు. ఇప్పటికే సీఎస్‌కేకు జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల్లో తాహీర్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. డ్వేన్‌ బ్రేవో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో తాహీర్‌కు తుది జట్టులో ఆడేది ఖాయంగానే ఉంది. (మీ ఆప్షన్‌ ఏది.. ఆరు సిక్స్‌లా.. సెంచరీనా?)

కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో తన యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడిన తాహీర్‌ కొన్ని విషయాలను పంచుకున్నాడు. ‘ నాకు సీఎస్‌కే నుంచి అందే సహకారం మరవలేనిది. ఒక ఫ్రాంచైజీ ఇంత రెస్పెక్ట్‌ ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదు. నన్ను సీఎస్‌కే చాలా గౌరవిస్తుంది. ఆల్‌ ఓవర్‌ వరల్డ్‌లో నా అత్యుత్తమ జట్టు సీఎస్‌కే. ఒక కుటుంబలో ఉన్న ఫీలింగ్‌ సీఎస్‌కేలో ఉంటుంది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ కూడా ఆటగాళ్లపై నమ్మశక్యం కాని ప్రేమ కురిపిస్తారు. చాలా భిన్న వాతావరణాల్లో ఆడినా ఇక్కడ కల్చర్‌ను ఇష్టపడతా. వారు(సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌) ప్రదర్శన గురించి ఎక్కువగా మాట్లాడరు.

ఎప్పుడూ మద్దతుగా ఉంటారు. క్రికెట్‌లో ఒక రోజు రాణించొచ్చు.. మరొకరోజు ఫెయిల్‌ కావొచ్చు.. సపోర్ట్‌ అనేది ముఖ్యం’ అని తాహీర్‌ చెప్పుకొచ్చాడు. ఇక నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండాలనే నిబంధనతోనే తనకు ఆడే అవకాశం రాలేదన్నాడు. తాను ఆడకుండా ఆటగాళ్లకు డ్రింక్స్‌ తీసుకెళ్లడాన్ని  కొంతమంది హేళన చేశారని, అది ఆటలో భాగమేనని తాహీర్‌ అన్నాడు. గతంలో సీజన్‌ మొత్తం డుప్లెసిస్‌ కూడా డ్రింక్స్‌ను అందించిన విషయాన్ని గుర్తుచేశాడు. టీ20 యావరేజ్‌ల్లో మెరుగ్గా ఉన్న డుప్లెసిస్‌ అప్పుడు అలా డ్రింక్స్‌ మోయడం కాస్త బాధనిపించినా కొన్ని పరిస్థితుల్లో తప్పదన్నాడు. అప్పుడు డుప్లెసిస్‌ ఎలా ఫీలై ఉంటాడో తనకు తెలుసన్నాడు. ఇప్పుడు అదే పని తాను చేస్తున్నా అది జట్టు కోసమేనని తాహీర్‌ తెలిపాడు.(గంభీర్‌.. ఇప్పుడేమంటావ్‌?)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు