‘వారి డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ను ఎప్పటికీ నమ్మరు’

29 Sep, 2020 17:45 IST|Sakshi

న్యూఢిల్లీ:  ముంబై ఇండియన్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరకు సూపర్‌ వరకూ వెళ్లింది. మరి సూపర్‌ ఓవర్‌లో ముంబై బ్యాట్‌ ఝుళిపించి హిట్టింగ్‌కు దిగుతుందని అంతా అనుకుంటే వారి ఏడు పరుగులే చేశారు. ఆర్సీబీ పేసర్‌ నవదీప్‌ సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌లో ముంబై స్టార్‌ ఆటగాళ్లు పొలార్డ్‌-హార్దిక్‌లు తడబడ్డారు. తొలి బంతినే యార్కర్‌తో ఆరంభించిన సైనీ ఓవర్‌ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. సూపర్‌ ఓవర్‌లో ఒకే ఒక్క ఫోర్‌ ఇచ్చి నిజంగా సూపర్‌ అనిపించాడు. దాంతో ఆర్సీబీ ఎనిమిది పరుగుల టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించింది.(చదవండి: 402 పరుగుల్లో 12 పరుగులే అంటే..)

ఇప్పడు సైనీ సూపర్‌ ఓవర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. ఆర్సీబీని కొనియాడుతున్నాడు. ప్రత్యేకంగా సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ను కొనియాడుతున్నాడు. ‘నువ్వు  ఎవర్ని నమ్మొచ్చో.. ఎవర్ని నమ్మకూడదో అది నువ్వు ఎంచుకోవచ్చు. కానీ జీవితంలో నమ్మకూడదని ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ డెత్‌ ఓవర్ల బౌలింగ్‌. ఈ మ్యాచ్‌ను ముంబై ఈజీగా గెలుస్తుందని అనుకున్నా. కానీ దాన్ని వారు సూపర్‌ ఓవర్‌ వరకూ తీసుకెళ్లారు. ఈ మ్యాచ్‌లో క్రెడిట్‌ ఎవరికైనా ఇవ్వాలంటే తొలుత నవదీప్‌ సైనీకి ఇవ్వాలి. డెత్‌ ఓవర్లలో సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. ఇక సూపర్‌ ఓవర్‌లో ఇరగదీశాడు. అదే సమయంలో 12 పరుగులే ఇచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఆర్సీబీ విజయంలో ప్రధాన పాత్రధారి. వీరిద్దరూ రాణించకపోతే ఆర్సీబీ కచ్చితంగా ఓడిపోయేది. ఆర్సీబీ డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ను మాత్రం ఎప్పటికీ ఎవరూ నమ్మరు’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన  ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.  ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌, శివం దూబేలు మెరుపులు మెరిపించారు. స్లాగ్‌ ఓవర్లలో వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. డివిలియర్స్‌ 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ భారీ షాట్లతో  అలరించాడు. ఈ క‍్రమంలోనే  23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. బుమ్రా, బౌల్ట్‌ వంటి బౌలర్లున్నా 360 డిగ్రీల ఆటతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో దూబే(27 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), పొలార్డ్‌(60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో మ్యాచ్‌ టై అయ్యింది. 20 ఓవర్‌ చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన దశలో పొలార్డ్‌ ఫోర్‌ కొట్టాడు. దాంతో స్కోరు సమం అయ్యింది. దాంతో సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది.

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు