హీరోయిన్‌తో మాస్‌ స్టెప్పులేసిన క్రికెటర్‌

16 Feb, 2021 18:03 IST|Sakshi

‘ఫ్రెండ్‌షిప్‌’ సినిమాలో భజ్జీ బిజీబిజీ

త్వరలోనే షూటింగ్‌ పూర్తి.. వేసవిలో విడుదల

లుంగీ కట్టి.. కళ్లజోడు పెట్టుకుని హీరోయిన్‌తో కలిసి భారత వెటరన్‌ క్రికెటర్‌ ఊరమాస్‌ స్టెప్పులు వేశాడు. త్వరలోనే ప్రేక్షకులు, అభిమానులను పలకరించేందుకు వెండితెరపై రానున్నాడు. ఆయనే స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌. ఆయన ‘ఫ్రెండ్‌షిప్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ పాట షూటింగ్‌ చేశారు. ఈ షూటింగ్‌లో భాగంగా భజ్జీ మాస్‌ స్టైల్‌ లుక్‌లో కనిపించాడు.

భజ్జీ ప్రస్తుతం ‘ఫ్రెండ్‌షిప్‌’ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతోందని, వేసవిలో విడుదల అవుతుందని ట్విటర్‌ వేదికగా హర్బజన్‌ ప్రకటించాడు. ఈ సందర్భంగా భజ్జీ భావోద్వేగానికి లోనయ్యాడు. తమిళ సంప్రదాయ వస్త్రధారణ (ధోతి) ధరించానని చెబుతూ.. ‘తమిళనాడు నన్ను తల్లిలా ఆదరించింది’ అని తమిళంలో ట్వీట్‌ చేశాడు. గతంలో చెన్నె సూపర్‌ కింగ్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా హర్బజన్‌ సింగ్‌ గుర్తుచేసుకున్నాడు.

బిగ్‌బాస్‌-3 ఫేమ్‌ లోస్లియా భజ్జీకి జోడీగా నటిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ లోస్లియాతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. జాన్‌ పాల్‌రాజ్‌, శ్యామ్‌ సూర్య నిర్మాణంలో ఫ్రెండ్‌షిప్‌ సినిమా రూపుదిద్దుకుంటోంది. యాక‌్షన్‌ కింగ్‌ అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2019లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా వలన ఆలస్యమైంది. ఇప్పుడు షూటింగ్‌ శరవేగంగా పూర్తయి వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. హర్బజన్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. సినిమా పూర్తయిన అనంతరం ఐపీఎల్‌లో కనిపించే అవకాశం ఉంది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాలో హర్బజన్‌ చోటు దక్కించుకున్నాడు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు