అభిమానుల కోసం కొత్త ‘స్పోర్ట్స్‌ యాప్‌’

24 Jul, 2022 05:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అరవై పదాల్లో ఆసక్తికర క్రీడా సమాచారం... ఇదే లక్ష్యంతో కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ మార్కెట్లోకి వచ్చింది. ‘వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్‌ సహ భాగస్వామి. సాయిప్రణీత్‌తో పాటు అనిల్‌ కుమార్‌ మామిడాల, ఈజేబీ ప్రమీల కలిసి ఈ యాప్‌ను తీసుకొచ్చారు.

ఇతర స్పోర్ట్స్‌ యాప్‌లతో పోలిస్తే ‘వాట్స్‌ ఇన్‌ ద గేమ్‌’ అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, షెడ్యూల్‌ మొదలు ఫలితాల వరకు సమాచారం అరవై పదాల్లోనే అందుబాటులో ఉంటుదని రూపకర్తలు వెల్లడించారు. ప్రొఫెషనల్‌గా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడినే అయినా... ఇతర క్రీడలపై తనకున్న ఆసక్తి, ఒక క్రీడాభిమానిగా అన్ని రకాల సమాచారం తెలుసుకోవాలని కుతూహలం కారణంగా ఇలాంటి యాప్‌ ఉంటే బాగుంటుందని భావించానని, అందుకే తాను భాగం అయ్యాయని సాయిప్రణీత్‌ వ్యాఖ్యానించాడు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు