IPL 2023: ఆ ఇద్దరి నుంచే కెప్టెన్సీ స్కిల్స్‌ నేర్చుకున్నా: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌

23 Feb, 2023 17:38 IST|Sakshi

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఐడెన్ మార్క్రమ్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ నుంచి మార్క్రమ్‌ బాధ్యతలు నుంచి స్వీకరించనున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌ మినీ వేలంకు ముందు విలియమ్సన్‌ను ఎస్‌ఆర్‌ హెచ్‌ విడిచిపెట్టింది.

అయితే మినీవేలంలో విలియమ్సన్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ సొంతం చేసుకుంది. అదే విధంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సారథ్యం వహించిన మార్క్రమ్.. తమ జట్టు తొలి టైటిల్‌ను అందించాడు. ఇక ఈ లీగ్‌లో మార్క్రమ్ సారధిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో కూడా ఆకట్టుకున్నాడు. 12 మ్యాచ్‌లు ఆడిన అతడు 366 పరుగులతో పాటు 11 వికెట్లు కూడా సాధించాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ సారథిగా బాధ్యతలు చేపట్టిన మార్క్రామ్ తొలి సారి స్పందించాడు.

ఇండియాటూడేతో మార్క్రమ్‌ మాట్లాడుతూ..
"సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్‌గా జట్టును విజయ పథంలో నడిపించడానికి 100 శాతం ఎఫక్ట్‌ పెడతాను. అదే విధంగా మా జట్టుకు అభిమానులు మద్దతు కూడా చాలా ఉంటుంది. కాబట్టి వారిని సంతృప్తి పరచేందుకు మేము గట్టిగా ప్రయత్నిస్తాం. ఇక నా కెరీర్‌లో ఆదర్శప్రాయులైన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే.. జాతీయ జట్టుకు ఆడేటప్పుడు ఫాఫ్ డు ప్లెసిస్‌ నుంచి చాలా విషయాలు నేర్చకున్నాను. ముఖ్యంగా ఒక సారథిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను.

ఇక గతేడాది సన్‌రైజర్స్‌లో ఆడినప్పుడు కేన్‌ విలియమ్సన్‌ నుంచి కూడా కెప్టెన్సీ స్కిల్స్‌ను నేర్చుకున్నాను. ఫాప్‌ లాగే కేన్‌ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం, వారిలో ఆత్మవిశ్వాసం నింపండం వంటవి విలియమ్సన్‌ ప్రత్యేకం. అందుకే ఈ ఇద్దరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అదే విధంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాతో కలిసి పనిచేయడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2023: సెమీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం

మరిన్ని వార్తలు