ENG Vs Nz: మిచెల్‌ వీరోచిత ఇన్నింగ్స్‌.. తొలి సారి టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు..

11 Nov, 2021 07:51 IST|Sakshi

తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్లతో విజయం

మొదటిసారి టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు అర్హత

మిచెల్‌ వీరోచిత ఇన్నింగ్స్‌

మెరిపించిన నీషమ్‌

ఇంగ్లండ్‌ కొంపముంచిన జోర్డాన్‌ ఓవర్‌ 

2016 టి20 ప్రపంచకప్‌ సెమీస్‌లో... 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమి బాధ ఎలా ఉంటుందో చూపించిన ఇంగ్లండ్‌కు ఈసారి న్యూజిలాండ్‌ కిర్రాక్‌ ఆటతీరుతో కలలో కూడా వెంటాడే రీతిలో షాక్‌ ఇచ్చింది. ఒకదశలో ఇంగ్లండ్‌ చేతిలో మూడోసారి ఐసీసీ ఈవెంట్‌ నాకౌట్‌ పోరులో న్యూజిలాండ్‌కు భంగపాటు తప్పదేమోననిపించింది. అయితే రేసుగుర్రంలా కనిపించిన ఇంగ్లండ్‌కు జేమ్స్‌ నీషమ్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌తో నిద్రలేని రాత్రి గడిచేలా చేశాడు. నీషమ్‌ 11 బంతుల సూపర్‌ ఇన్నింగ్స్‌ ఇంగ్లండ్‌కు దిమ్మదిరిగేలా చేసింది. ఓపెనర్‌గా వచ్చి ఆఖరి దాకా నిలిచిన డారిల్‌ మిచెల్‌ ఇన్నింగ్స్‌ న్యూజిలాండ్‌ తొలిసారి టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరేందుకు దోహదపడింది. 

New Zealand beat England by 5 wickets enter final of T20 World Cup: ఇంగ్లండ్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసింది. తర్వాత న్యూజిలాండ్‌ను తిప్పలు పెట్టింది. కివీస్‌ లక్ష్యఛేదనలో 16 ఓవర్ల దాకా ఇంగ్లండ్‌దే పైచేయి. తర్వాత మూడు ఓవర్లు, నీషమ్‌ మెరుపులు మోర్గాన్‌ బృందం ఆశలను తలకిందులు చేశాయి. దీంతో ఇంకో ఓవర్‌ మిగిలుండగానే న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తమకు ఐసీసీ ప్రపంచకప్‌లను దూరం చేస్తున్న ఇంగ్లండ్‌ను ఈ మెగా ఈవెంట్‌ సెమీఫైనల్లో కివీస్‌ కసిదీరా ఓడించి మరీ ఫైనల్‌ చేరింది.

తొలుత ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (37 బంతుల్లో 51 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ మలాన్‌ (30 బంతుల్లో 41; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. కివీస్‌ బౌలర్లలో సౌతీ, మిల్నే, సోధి, నీషమ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డారిల్‌ మిచెల్‌ (47 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా నిలిచాడు. కాన్వే (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌), నీషమ్‌ (11 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లివింగ్‌స్టోన్, వోక్స్‌ చెరో 2 వికెట్లు తీశారు. 

మొయిన్‌ అలీ ఫిఫ్టీ 
టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనింగ్‌ జేసన్‌ రాయ్‌ లేని లోటు కనిపించింది. రాయ్‌ లేని ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మెరుపులు కరువయ్యాయి. అయితే రన్‌రేట్‌ 6, 7 పరుగులకు పైనే సాగిపోయింది. బట్లర్‌కు జతగా ఓపెనింగ్‌లో వచ్చిన బెయిర్‌స్టో (13) విఫలమయ్యాడు. మరోవైపు కివీస్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బట్లర్‌ కూడా ధాటిగా ఆడలేకపోయాడు.

దీంతో పవర్‌ ప్లే (6 ఓవర్లు)లో ఇంగ్లండ్‌ 40/1 స్కోరు చేయగలిగింది.  9వ ఓవర్లో బట్లర్‌ (24 బంతుల్లో 29; 4 ఫోర్లు)ను సోధి బోల్తా కొట్టించాడు. 10 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు 67/2. మలాన్, మొయిన్‌ అలీ పరుగు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. భారీషాట్లు కొట్టకపోయినా అడపాదడపా బౌండరీలతో జట్టు స్కోరును 14వ ఓవర్లో 100 పరుగులకు చేర్చారు. చేతిలో వికెట్లున్నా... ఇద్దరిలో ఏ ఒక్కరూ ఎదురుదాడి చేయలేకపోయారు.

ఎట్టకేలకు 16వ ఓవర్‌ తొలి బంతికి మలాన్‌ సిక్స్‌ కొట్టాడు. ఇన్నింగ్స్‌లో ఇదే తొలి సిక్స్‌. కానీ మరుసటి బంతికే అతను ఔటయ్యాడు. ఆఖరి ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో లివింగ్‌స్టోన్‌ (17; ఫోర్, సిక్స్‌) వికెట్‌ సమర్పించుకున్నాడు. మొయిన్‌ అలీ 36 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసిన అర్ధసెంచరీతో ఇంగ్లండ్‌ 150 పైచిలుకు స్కోరు చేయగల్గింది.  

లక్ష్యం కఠినమైంది... 
లక్ష్యఛేదనలో కివీస్‌ తడబడింది. పవర్‌ ప్లేలో ప్రత్యర్థి బంతులతో పాటు కష్టాలను ఎదుర్కొంది. ఇన్నింగ్స్‌ తొలి బంతినే బౌండరీకి తరలించిన గప్టిల్‌  (4) మూడో బంతికి పెవిలియన్‌ చేరాడు. జట్టును నడిపిస్తాడనుకున్న నాయకుడు విలియమ్సన్‌ (5) విఫలమయ్యాడు. ఓపెనర్‌ మిచెల్, కాన్వే చూసుకొని ఆడారు. దీంతో కివీస్‌ పవర్‌ప్లేలో 2 వికెట్లకు 36 పరుగులు చేసింది. ఆ తర్వాత 10 ఓవర్ల దాకా కివీస్‌ స్కోరు (58/2) అదే తీరుగా సాగింది. మిగిలున్న 10 ఓవర్లలో 109 పరుగులు చేయాల్సిన కొండంత లక్ష్యమైంది. అయితే 11వ ఓవర్‌ నుంచి మిచెల్, కాన్వే బ్యాట్‌కు పనిచెప్పడంతో ఐదు ఓవర్లలో 49 పరుగులు వచ్చాయి. 14వ ఓవర్లో కాన్వే అవుటయ్యాడు.

 
నీషమ్‌ ధనాధన్‌... 
ఆఖరి 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన దశలో 16వ ఓవర్‌ తొలి బంతికే ఫిలిప్స్‌ (2)ను లివింగ్‌స్టోన్‌ బోల్తా కొట్టించాడు. ఈ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇవ్వడంతో కివీస్‌ విజయసమీకరణం 24 బంతుల్లో 57 పరుగులుగా మారింది. అయితే జోర్డాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో నీషమ్‌ ఓ ఆట ఆడుకున్నాడు. 6, 2, 1, 4, 1, 6, 2, 1లతో ఏకంగా 23 పరుగులు రావడంతో కివీస్‌ లక్ష్యానికి ఊపిరిపోసింది.

వెంటనే స్పిన్నర్‌ రషీద్‌కు బంతి అప్పగించాడు. నీషమ్, మిచెల్‌ చెరో సిక్సర్‌ బాదారు. 14 పరుగులొచ్చాయి... కానీ ఆఖరి బంతికి నీషమ్‌ మెరుపులకు రషీద్‌ అడ్డుకట్ట వేశాడు. ఇక 12 బంతులు 20 పరుగుల సమీకరణం మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచింది.  కానీ వోక్స్‌ వేసిన 19వ ఓవర్లో ఓపెనర్‌ మిచెల్‌ వరుసగా రెండు సిక్సర్లు, ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టడంతో న్యూజిలాండ్‌ విజయం ఖాయమైంది. ఇంగ్లండ్‌కు చివరి ఓవర్‌ వేయాల్సిన అవసరమే రాలేదు.

చదవండి: Keshav Maharaj: దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కేశవ్‌ మహారాజ్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు