న్యూజిలాండ్‌ నంబర్‌వన్‌

7 Jan, 2021 05:28 IST|Sakshi

ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానంలోకి

రెండో టెస్టులో పాక్‌పై ఇన్నింగ్స్‌ 176 పరుగులతో ఘనవిజయం

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ (6/48) మళ్లీ నిప్పులు చెరగడంతో పాకిస్తాన్‌ కుప్పకూలింది. దీంతో ఆఖరి టెస్టులో కివీస్‌ ఇన్నింగ్స్‌ 176 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో ఆతిథ్య జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. బుధవారం ఓవర్‌నైట్‌ స్కోరు 8/1తో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 81.4 ఓవర్లలో 186 పరుగులు చేసి ఆలౌటైంది. అజహర్‌ అలీ (37; 6 ఫోర్లు), జాఫర్‌ గోహర్‌ (37; 7 ఫోర్లు), ఫహీమ్‌ అష్రఫ్‌ (28; 3 ఫోర్లు) మినహా మిగతా వారెవరూ ఆతిథ్య బౌలర్లకు ఎదురునిలిచే సాహసం చేయలేకపోయారు. జేమీసన్‌ 6 వికెట్లు పడగొట్టగా... సీనియర్‌ సీమర్‌ బౌల్ట్‌ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో పాకిస్తాన్‌ 297 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ 659/6 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. జేమీసన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... విలియమ్సన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’     అవార్డులు గెల్చుకున్నారు.  

ఆసీస్‌ను వెనక్కినెట్టి ‘టాప్‌’లోకి...
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఇన్నాళ్లు అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో పాయింట్ల పరంగా న్యూజిలాండ్‌ (116 పాయింట్లు) సమంగా నిలిచింది. అయితే డెసిమల్‌ పాయింట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమైన న్యూజిలాండ్‌ ఇప్పుడు స్పష్టమైన తేడాతో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. పాక్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా న్యూజిలాండ్‌ 118 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఆసీస్‌ (116), భారత్‌ (114) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు పాక్‌తో రెండు టెస్టుల్లో కలిపి 388 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌ లో 890 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

మరిన్ని వార్తలు