Michael Rippon: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్‌ క్రికెటర్‌

21 Jun, 2022 15:41 IST|Sakshi

నెదర్లాండ్స్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ రిప్పన్‌ అరుదైన ఘనత అందుకోనున్నాడు. క్రికెట్‌లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఆ జాబితాలోకి మైకెల్‌ రిప్పన్‌ అడుగుపెట్టనున్నాడు. ఇంతకాలం నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రిప్పన్‌ ఇకపై న్యూజిలాండ్‌ తరపున ఆడనున్నాడు. యూరోపియన్‌ టూర్‌లో భాగంగా ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌ లాంటి అసోసియేట్‌ దేశాలతో కివీస్‌ జట్టు సిరీస్‌లు ఆడనుంది.

దీనిలో భాగంగా  ఆ టూర్‌లో పాల్గొనే ఆటగాళ్లను కివీస్‌ క్రికెట్‌ బోర్డు ఎంపిక చేసింది. వచ్చే జూలై, ఆగస్టు నెలల్లో ఈ టూర్‌ జరగనుంది. మొదట ఐర్లాండ్‌తో మూడు వన్డేలు.. మూడు టి20లు ఆడనున్న న్యూజిలాండ్‌ ఆ తర్వాత ఎడిన్‌బర్గ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో రెండు టి20లు, ఒక వన్డే మ్యాచ్‌ ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లు ముగిసిన తర్వాత అమ్‌స్టర్‌డామ్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఐర్లాండ్‌తో వన్డేలకు టామ్‌ లాథమ్‌ కివీస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఐర్లాండ్‌తో టి20లు, స్కాట్లాండ్‌తో వన్డే, టి20లు, నెదర్లాండ్స్‌తో టి20లకు మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఐర్లాండ్‌తో వన్డే జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలామంది నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌తో సిరీస్‌లో పాల్గొననున్నారు.  

కాగా సౌతాఫ్రికాకు చెందిన మైకెల్‌ రిప్పన్‌ కుటుంబసభ్యులు 2013లో న్యూజిలాండ్‌కు వలస వచ్చారు. అయితే న్యూజిలాండ్‌లో క్రికెట్‌ ఓనమాలు నేర్చుకున్న రిప్పన్‌.. డచ్‌ దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్‌ తరపున 9 వన్డేలు, 21 టి20 మ్యాచ్‌లు ఆడిన రిప్పన్‌.. తాజాగా బ్లాక్‌ క్యాప్స్‌కు ఆడనున్నాడు. అయితే మైకెల్‌ రిప్పన్‌ ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. కేవలం స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌తో సిరీస్‌ల్లో ఆడనున్నాడు.

ఇక ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఏదైనా సభ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు ఒక ఐసీసీలో పూర్తి స్థాయి జట్టుకు ఆడే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి పూర్తిస్థాయి జట్టుకు ఎంపికైతే మాత్రం మూడేళ్ల పాటు అసోసియేట్‌ దేశాలకు ఆడే వీలు మాత్రం ఉండదు. కాగా గతంలోనే ఇలా రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వారిలో ప్రస్తుత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌( ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌), లూక్‌ రోంచి( న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా), మార్క్‌ చాప్‌మన్‌(హాంకాంగ్‌, న్యూజిలాండ్‌), గ్జేవియర్‌ మార్షల్‌(అమెరికా, వెస్టిండీస్‌),హెడెన్‌ వాల్ష్‌(అమెరికా, వెస్టిండీస్‌), డేవిడ్‌ వీస్‌(సౌతాఫ్రికా, నమీబియా)లు ఉన్నారు.

ఐర్లాండ్ పర్యటనలో వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేన్ క్లీవర్ (వికెట్‌ కీపర్‌), జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ , మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్‌

ఐర్లాండ్ టి20, స్కాట్లాండ్ & నెదర్లాండ్స్‌తో కివీస్‌ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్ (వికెట్‌ కీపర్‌), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్ మైఖేల్ రిప్పన్, బెన్ సియర్స్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్

చదవండి: బౌలర్‌ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్‌ అంపైర్‌కు హక్కు ఉంటుందా?

 ఇదేందయ్యా ఇది.. క్యాచ్‌ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్‌.. వీడియో వైరల్‌!

>
మరిన్ని వార్తలు