పాకిస్తాన్‌లో భద్రత లేదంటూ... కివీస్‌ పర్యటన రద్దు!

18 Sep, 2021 04:37 IST|Sakshi
తొలి వన్డే జరగాల్సిన రావల్పిండి స్టేడియంలో మ్యాచ్‌కు ముందు భద్రతా సిబ్బంది

తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్‌  అనూహ్య నిర్ణయం

రావల్పిండి: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ పెద్ద జట్టు మా దేశ పర్యటనకు వచి్చందన్న ఆనందం ఆవిరైంది. న్యూజిలాండ్‌ ఇంకాసేపట్లో తొలి వన్డే కోసం బరిలోకి దిగాల్సివుండగా... మ్యాచ్‌నే కాదు ఏకంగా సిరీస్‌నే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ ఉలిక్కిపడింది. ఒక్కసారిగా అయోమయంలో పడింది. ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది.  

అసలేం జరిగింది?
శుక్రవారం మ్యాచ్‌ కోసం ఇరు జట్లు బస చేసిన హోటల్‌ నుంచి స్టేడియానికి చేరాల్సివుంది. ఆటగాళ్లేమో గదుల నుంచి బయటికి రావడం లేదు. వారి కోసం బస్సులు ఎదురుచూస్తున్నాయి. న్యూజిలాండ్‌ వర్గాల నుంచి ఒక ప్రకటన మాత్రం బయటికి వచి్చంది. ‘ఈ పర్యటన ఇక ఏమాత్రం ముందుకు సాగదు. మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆడటం సాధ్యపడదు. ఈ నిర్ణయం పీసీబీకి మింగుడుపడదని మాకు తెలుసు. ఘనమైన ఆతిథ్య ఏర్పాట్లు ఎన్నో చేశారు.  అయితే మా ఆటగాళ్ల భద్రత దృష్ట్యానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ సీఈఓ డేవిడ్‌ వైట్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

దీంతో పీసీబీ వర్గాలకు ఊపిరి ఆగినంత పనైంది. వెంటనే దిగ్గజ కెపె్టన్‌ అయిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రంగంలోకి దిగారు. కివీస్‌ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఫోన్‌ చేశారు. ఆటగాళ్ల భద్రతకు హామీ ఇచ్చారు. కానీ ఆమె ఆటగాళ్లను పాక్‌లో ఉంచేందుకు ససేమిరా అని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత కివీస్‌ మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్‌ కోసం పాక్‌ పర్యటనకు ఈ నెల 11న  ఇక్కడికి వచి్చంది. ఆతిథ్య, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వెలిబుచ్చింది. ఇంతలోనే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మూడు రోజుల క్రితమే పీసీబీ చీఫ్‌ పదవి చేపట్టిన రమీజ్‌ రాజా న్యూజిలాండ్‌ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఐసీసీ పేషీలోనే తేల్చుకుంటామని ట్విట్టర్‌లో ప్రకటించారు.  

మేమూ సమీక్షిస్తాం: ఈసీబీ
వచ్చే నెల పాక్‌ పర్యటనకు వెళ్లాల్సిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కూడా తమ నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని చెప్పింది. ‘ఒకట్రెండు రోజుల్లో చర్చించుకొని టూర్‌ ప్రణాళికను వెల్లడిస్తాం’ అని ఈసీబీ తెలిపింది. వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇంగ్లండ్‌ రావలి్పండి వేదికగా రెండు టి20లు ఆడేందుకు వెళ్లాల్సివుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో ఆసీస్‌ కూడా పాక్‌లో పర్యటించాల్సివుంది. కానీ అనిశి్చత పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.
 

మరిన్ని వార్తలు