రిటైర్మెంట్‌ ప్రకటించిన కివీస్‌ స్టార్‌ క్రికెటర్‌

5 Dec, 2020 16:02 IST|Sakshi

ఆక్లాండ్‌ : న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ కోరె అండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా అండర్సన్‌ వెల్లడించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా(మొదటి స్థానంలో ఏబి డివిలియర్స్‌) అండర్సన్‌ రికార్డు సాధించాడు. 2014లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 36 బంతుల్లోనే సెంచరీ సాధించిన అండర్సన్‌ అప్పటివరకు షాహిద్‌ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.

అయితే  సరిగ్గా ఏడాది తర్వాత 2015లో దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబి డివిలియర్స్‌ కేవలం 31 బంతుల్లోనే సెంచరీ సాధించి ఆ రికార్డును తిరగరాశాడు. తనకు కాబోయే భార్య కోరిక మేరకు కివీస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి యూఎస్‌ఏ మేజర్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడనున్నట్లు అండర్సన్‌ తెలిపాడు. (చదవండి : '11 ఏళ్లయినా తక్కువ అంచనా వేస్తున్నారు')


'ఇంతకాలం కివీస్‌ క్రికెటర్‌గా కొనసాగినందుకు గర్వంగా ఫీలవుతున్నా. కివీస్‌ జట్టుకు సేవలందించినందుకు సంతోషంగా ఉన్నా. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు అదే సరైన సమయమని భావించాలి. నా ప్రియురాలు.. కాబోయే భార్య మేరీ మార్గరేట్‌ అమెరికాలో ఉంటుంది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాను. అమెరికాలోని యూఎస్‌ మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ ఆడాలని మార్గరేట్‌ కోరడంతో కాదనలేకపోయా. అందుకే కివీస్‌ జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఇన్నిరోజులు నాకు అండగా నిలిచిన కివీస్‌ బోర్డుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.' అంటూ అండర్స్‌న్‌ చెప్పుకొచ్చాడు.(చదవండి : 'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు')


2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా 29 ఏళ్ల కోరె అండర్సన్‌ కివీస్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరున్న అండర్సన్‌ భారీ షాట్లకు పెట్టింది పేరు.  తన కెరీర్‌లో 13 టెస్టుల్లో 683 పరుగులు, 49 వన్డేల్లో 1,109 పరుగులు, 31 టీ20ల్లో 485 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే టెస్టుల్లో 16, వన్డేల్లో 60, టీ20ల్లో 14 వికెట్లు తీశాడు. అండర్సన్‌ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎక్కువభాగం గాయాలతో సతమతమయ్యాడు. అతను కివీస్‌ తరపున చివరిసారిగా 2018లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. అప్పటినుంచి కివీస్‌ జట్టు తరపున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. కాగా అండర్సన్‌ ఐపీఎల్‌లో  ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ , ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. (చదవండి : కోహ్లికి మాత్రం రూల్స్‌ వర్తించవా?)

మరిన్ని వార్తలు