గంగూలీ 25 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్‌..

3 Jun, 2021 16:06 IST|Sakshi

లండన్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 25 ఏళ్ల కింద నెలకొల్పిన ఓ అరుదైన రికార్డును న్యూజిలాండ్‌ ఆటగాడు డెవాన్‌ కాన్వే బద్దలు కొట్టాడు. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో బుధవారం మొదలైన తొలి టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అజేయమైన 136 పరుగులు సాధించిన కాన్వే.. 1996లో ఇదే వేదికపై గంగూలీ నెలకొల్పిన 131 పరుగుల అత్యధిక స్కోర్‌ రికార్డును అధిగమించాడు. ఈ క్రమంలో లార్డ్స్‌ మైదానంలో అరంగేట్రంలో సెంచరీ సాధించిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. దీంతో పాటు కాన్వే మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌ తరఫున తొలి మ్యాచ్‌లోనే శతకం నమోదు చేసిన 12వ ఆటగాడిగా, అలాగే న్యూజిలాండ్‌ తరఫున అరంగేట్రంలో నాలుగో అత్యధిక స్కోర్‌ చేసిన ప్లేయర్‌గా రికార్డులు నెలకొల్పాడు.  

కాగా, గంగూలీ, కాన్వేకు సంబంధించిన కొన్ని విషయాలు యాదృచ్చికంగా ఒకేలా ఉన్నాయి. వీరిద్దరు లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌, రైట్‌ హ్యాండ్‌ మీడియం పేసర్లు కాగా, వీరిద్దరి పుట్టిన రోజు కూడా ఒకే రోజు కావడం విశేషం. దాదా, కాన్వేలు జులై 8న జన్మించారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం మొదలైన తొలి టెస్ట్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (240 బంతుల్లో 136 నాటౌట్‌; 16 ఫోర్లు), హెన్రీ నికోల్స్‌ (46 నాటౌట్‌; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయమైన 132 పరుగులు జోడించారు. టామ్‌ లాథమ్‌(23), కెప్టెన్‌ విలియమ్సన్‌(13), రాస్‌ టేలర్‌(14) తక్కువ స్కోర్‌కే అవుటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రాబిన్సన్‌ రెండు, అండర్సన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 
చదవండి: ఆ ఐపీఎల్‌ ఆటగాళ్లకు జీతాలు కట్‌..

మరిన్ని వార్తలు