Ind Vs Nz T20 Series 2021: మార్పులతో మూడో మ్యాచ్‌కు...

21 Nov, 2021 05:26 IST|Sakshi

కొత్త ఆటగాళ్లకు భారత్‌ అవకాశం

నేడు న్యూజిలాండ్‌తో చివరి టి20

క్లీన్‌స్వీప్‌పై టీమిండియా దృష్టి

రాత్రి గం.7:00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

కోల్‌కతా: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను వరుస విజయాలతో గెలుచుకున్న భారత జట్టు క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా నేడు ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరిగే చివరి మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్‌కప్‌లో కనీసం సెమీస్‌ కూడా చేరని నిరాశను కొంత వరకు తగ్గిస్తూ గత రెండు మ్యాచ్‌లలో చెలరేగిన భారత బృందం అదే జోరు కొనసాగిస్తే గెలుపు అసాధ్యం కాదు. మరోవైపు ప్రపంచకప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ మాత్రం పూర్తిగా తేలిపోయింది. కనీసం ఇక్కడైనా గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. కోల్‌కతా పిచ్‌లో చక్కటి పేస్, బౌన్స్‌ ఉండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.  

అవేశ్‌ ఖాన్‌కు చాన్స్‌!
ఈ సిరీస్‌ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్, హర్షల్‌ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. మిగిలిన వారిలో ఒక్క పేసర్‌ అవేశ్‌ ఖాన్‌కు మాత్రమే ఇంకా అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ లేదా దీపక్‌ చహర్‌లలో ఒకరిని తప్పించి మధ్యప్రదేశ్‌కు చెందిన అవేశ్‌ను ఆడించవచ్చు. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ ఐపీఎల్‌తో ఆకట్టుకున్న అవేశ్‌... భారత టెస్టు జట్టు రిజర్వ్‌ బౌలర్లలో ఒకడిగా ఇటీవల ఇంగ్లండ్‌ కూడా వెళ్లాడు. శ్రీలంక పర్యటనలో రెండు టి20లు ఆడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ను కూడా సూర్యకుమార్‌ స్థానంలో బరిలోకి దించే అవకాశం ఉంది. అదే తరహాలో లెగ్‌స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ కూడా తన చాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. టీమ్‌లోని ఇతర సభ్యులందరూ ఫామ్‌లో ఉన్నారు.   

మార్పుల్లేకుండానే...
కివీస్‌ పరిస్థితి మాత్రం అంత గొప్పగా లేదు. రెండుసార్లు అద్భుత ఆరంభాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్లు అవుట్‌ కాగానే జట్టు కుప్పకూలిపోతోంది. ఐదుగురు రెగ్యులర్‌ బ్యాట్స్‌మెన్, ఆల్‌రౌండర్‌ నీషమ్‌తో బరిలోకి దిగుతున్నప్పటికీ న్యూజిలాండ్‌ భారీ స్కోరు చేయలేకపోతోంది. బౌలింగ్‌లో ఇద్దరు స్పిన్నర్లు సాన్‌ట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పేసర్‌ బౌల్ట్‌ కూడా నిరాశపరిచాడు. మొత్తంగా భారత్‌ను ఓడించి ఒక విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవా లంటే కివీస్‌ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు