వైరల్‌: ‘సింగిల్‌ తీయకపోతే, నీకు ఉంటది’

3 Jan, 2021 14:02 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌‌: న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య హగ్లే ఓవల్‌ స్టేడియంలో జరిగిన రెండో ఆఖరి టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఆటగాడు నసీమ్‌ షా వార్తల్లో నిలిచాడు. అతను వార్తల్లో నిలిచింది తన బ్యాటింగ్‌ స్కిల్స్‌తో కాదు...  ఫన్నీ కామెంట్లతో. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఆదివారం మొదలైన మ్యాచ్‌ తొలిరోజు 83.5 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 297 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈక్రమంలోనే 83 వ ఓవర్‌ మొదలవడానికి ముందు చివరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన నసీమ్‌ షా.. అప్పటికే క్రీజులో ఉన్న మహ్మద్‌ అబ్బాస్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. 

‘పరుగులు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎలాగైనా సింగిల్‌ తీసి త్వరగా స్ట్రయిక్‌ ఇవ్వు. లేదంటే డ్రెస్సింగ్‌ రూమ్‌ వెళ్లాక నీకు తిట్లు తప్పవు’అని నసీమ్‌ చెప్పడం స్టంప్స్‌ మైకుల్లో రికార్డయింది. ఈ హిలేరియస్‌ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక చివరి వికెట్‌గా క్రీజులోకొచ్చిన నసీమ్‌ (12) మూడు ఫోర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేయడం గమనార్హం. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన 83వ ఓవర్‌ ఐదో బంతికి సెకండ్‌ స్లిప్‌లో లాథమ్‌ క్యాచ్‌ పట్టడంతో అతను పెవిలియన్‌చేరాడు. దాంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌తోపాటు మొదటి రోజు ఆట ముగిసింది. పాక్‌ ఆటగాళ్లలో అజర్‌ అలీ 93, మహ్మద్‌ రిజ్వాన్‌ 61 పరుగులతో జట్టును ఆదుకున్నారు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, బౌల్ట్‌ రెండు వికెట్లు, హెన్రీ ఒక వికెట్‌ సాధించారు. కైలీ జిమ్మీషన్‌ 5 వికెట్లతో చెలరేగాడు.
(చదవండి: వైరల్‌ : టాస్‌ వేశారు.. కాని కాయిన్‌తో కాదు)

మరిన్ని వార్తలు