IND Vs NZ: తొలి టి20లో టీమిండియా ఓటమి..

28 Jan, 2023 09:15 IST|Sakshi

తొలి గెలుపు రుచి చూసిన న్యూజిలాండ్‌

టీమిండియాకు ఆల్‌రౌండ్‌ దెబ్బ

మొదటి టి20 మ్యాచ్‌లో హార్దిక్‌ బృందం ఓటమి

సుందర్‌ ఒంటరి పోరాటం

రేపు లక్నోలో రెండో టి20

రాంచీ: ధోని ఇలాకాలో న్యూజిలాండ్‌ గెలుపు పండగ చేసుకుంది. మొదటి టి20లో 21 పరుగులతో గెలిచిన కివీస్‌ భారత పర్యటనలో తొలి విజయాన్ని సాధించింది. ‘ఆల్‌రౌండ్‌ షో’తో టీమిండియా జోరుకు బ్రేకులేసింది. ముందుగా కివీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డరైల్‌ మిచెల్‌ (30 బంతుల్లో 59 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155     పరుగులే చేసి ఓడిపోయింది. సుందర్‌ (28 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (34 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కివీస్‌ బౌలర్లలో బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్, ఫెర్గూసన్‌ తలా 2 వికెట్లు తీశారు. రెండో టి20 రేపు లక్నోలో జరుగుతుంది.

మిచెల్‌ మెరుపులు
అలెన్‌ (23 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చాప్‌మన్‌ (0)... ఇలా వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ ఉచ్చులో పడిన కివీస్‌ను కాన్వే ఆదుకున్నాడు. ఫిలిప్స్‌ (17; 1 ఫోర్‌)తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. 31 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ పూర్తిచేసుకున్న కాన్వేను అర్‌‡్షదీప్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత మిచెల్‌ ఆఖరిదాకా ఉండి మెరిపించిన మెరుపులతో న్యూజిలాండ్‌ మంచి స్కోరు చేసింది. 26 బంతుల్లో (2 ఫోర్లు, 5 సిక్సర్లు) మిచెల్‌ అర్ధ  సెంచరీ సాధించాడు. అర్‌‡్షదీప్‌ వేసిన చివరి ఓవర్‌ లో మిచెల్‌ ఏకంగా 27 పరుగులు (6 (నోబాల్‌), 6, 6, 4, 0, 2, 2) సాధించడం విశేషం.    

చెత్త షాట్లతో...
కష్టసాధ్యమైన లక్ష్యం ముందుంటే భారత టాపార్డర్‌ నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకుంది. ఇషాన్‌ కిషన్‌ (4), త్రిపాఠి (0), గిల్‌ (7) చెత్త షాట్లతో అవుటవ్వడంతో జట్టు 15/3 స్కోరు వద్ద కష్టాల పాలైంది. ఈ దశలో ‘టి20 సూపర్‌ బ్యాటర్‌’ సూర్యకుమార్, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (20 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌) కాసేపు బాధ్యతగా ఆడటంతో ఆశలు రేగాయి. నాలుగో వికెట్‌కు 68 జతయ్యాక వరుస ఓవర్లలో సూర్య, పాండ్యా అవుట్‌ కావడంతో... అప్పటికింకా భారత్‌ 100 పరుగులైనా చేయకపోవడంతో ఓటమి ఖాయమైంది. అయితే సుందర్‌ (25 బంతుల్లో ఫిఫ్టీ; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులతో భారత్‌ 150 మార్క్‌ దాటింది.

అతి‘సుందర్‌’ క్యాచ్‌
ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌తో మాయ చేశాడు. క్యాచ్‌తో మంత్రముగ్ధం చేశాడు. రెండో బంతికి దంచేస్తున్న అలెన్‌ను సూర్య క్యాచ్‌తో పెవిలియన్‌ పంపాడు. ఆఖరి బంతికి చాప్‌మన్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు.

అక్కడే లేచిన బంతి నేలకు తాకుతుండగా... సుందర్‌ కుడివైపునకు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో రిటర్న్‌ క్యాచ్‌ పట్టాడు. దీంతో స్టేడియం హోరెత్తింది. బ్యాటింగ్‌లోనూ సుందర్‌ మెరుపు ఫిఫ్టీ సాధించాడు. కానీ అతని ‘ఆల్‌రౌండ్‌ షో’ భారత ఓటమితో చిన్నబోయింది.  

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (సి) సూర్య (బి) సుందర్‌ 35; కాన్వే (సి) హుడా (బి) అర్‌‡్షదీప్‌ 52; చాప్‌మన్‌ (సి అండ్‌ బి) సుందర్‌ 0; ఫిలిప్స్‌ (సి) సూర్య (బి) కుల్దీప్‌ 17; మిచెల్‌ (నాటౌట్‌) 59; బ్రేస్‌వెల్‌ (రనౌట్‌) 1; సాన్‌ట్నర్‌ (సి) త్రిపాఠి (బి) మావి 7; ఇష్‌ సోధి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176.
వికెట్ల పతనం: 1–43, 2–43, 3–103, 4–139, 5–140, 6–149.
బౌలింగ్‌: పాండ్యా 3–0–33–0, అర్‌‡్షదీప్‌ 4–0–51–1, సుందర్‌ 4–0–22–2, దీపక్‌ 2–0– 14–0, ఉమ్రాన్‌ 1–0–16–0, కుల్దీప్‌ 4–0–20–1, శివమ్‌ మావి 2–0–19–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) అలెన్‌ (బి) సాన్‌ట్నర్‌ 7; ఇషాన్‌ (బి) బ్రేస్‌వెల్‌ 4; త్రిపాఠి (సి) కాన్వే (బి) డఫీ 0; సూర్య (సి) అలెన్‌ (బి) సోధి 47; పాండ్యా (సి అండ్‌ బి) బ్రేస్‌వెల్‌ 21; సుందర్‌ (సి) డఫీ (బి) ఫెర్గూసన్‌ 50; హుడా (స్టంప్డ్‌) కాన్వే (బి) సాన్‌ట్నర్‌ 10; మావి (రనౌట్‌) 2; కుల్దీప్‌ (సి) కాన్వే (బి) ఫెర్గూసన్‌ 0; అర్‌‡్షదీప్‌ (నాటౌట్‌) 0; ఉమ్రాన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1–10, 2–11, 3–15, 4–83, 5–89, 6–111, 7– 115, 8–127, 9–151.
బౌలింగ్‌: డఫీ 3–0– 27– 1, బ్రేస్‌వెల్‌ 4– 0–31–2, సాన్‌ట్నర్‌ 4–1–11 –2, ఫెర్గూసన్‌ 4–1– 33–2, సోధి 3–0–30–1, టిక్నర్‌ 2–0–23–0. 

మరిన్ని వార్తలు