CPL 2021 Nicholas Pooran: సిక్సర్లతో శివమెత్తిన పూరన్‌.. ఫ్లే ఆఫ్‌కు మరింత చేరువగా

12 Sep, 2021 10:12 IST|Sakshi

జమైకా: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2021)లో నికోలస్‌ పూరన్‌ మరోసారి సిక్సర్ల వర్షం కురిపించాడు. (39 బంతుల్లో 75 పరుగులు నాటౌట్‌, 4 ఫోర్లు, 7 సిక్సర్లతో) రెచ్చిపోయిన పూరన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గయానా అమెజాన్‌ వారియర్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. జమైకా తలైవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలవడంతో పాటు ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇక జమైకా తలైవాస్‌ వరుస ఓటములతో మరింత అట్టడుగుకు చేరింది. లీగ్‌లో నిలవాలంటే జమైకా అన్ని మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చదవండి: Viral Video: రనౌట్‌ అవకాశం; ఊహించని ట్విస్ట్‌.. ఫీల్డర్ల పరుగులు


మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా అమెజాన్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌, చంద్రపాల్‌, హెట్‌మైర్‌, షోయబ్‌ మాలిక్‌లు మంచి ఆరంభాలే ఇచ్చినప్పటికీ పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. అయితే ఫామ్‌లో ఉన్న పూరన్‌ మాత్రం తన విధ్వంసాన్ని కొనసాగించాడు. కొడితే ఫోర్‌ లేదంటే సిక్స్‌ అన్న తరహాలో పూరన్‌ ఇన్నింగ్స్‌ సాగింది. 18వ ఓవర్‌ వరకు సాదాసీదాగా ఉన్న వారియర్స్‌ స్కోరు పూరన్‌  ధాటికి చివరి రెండు ఓవర్లలో 30 పరుగులతో 160కి పైగా పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తైలవాస్‌ 19.1 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై 46 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. కిర్క్‌ మెకెంజీ 28 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. గయానా బౌలర్లలో ఓడియన్‌ స్మిత్‌ 3 వికెట్లు తీశాడు.

చదవండి: CPL 2021: వసీమ్‌, రసెల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు.. సెమీస్‌ ఆశలు సజీవం

మరిన్ని వార్తలు