Nicholas Pooran: వెస్టిండీస్‌ వన్డే, టి20 కొత్త కెప్టెన్‌గా నికోలస్‌ పూరన్‌

3 May, 2022 19:25 IST|Sakshi

వెస్టిండీస్‌ వన్డే, టి20 కొత్త కెప్టెన్‌గా నికోలస్‌ పూరన్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు క్రికెట్‌ వెస్టిండీస్‌(సీడబ్ల్యూఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పొలార్డ్‌ స్థానంలో పూరన్‌ విండీస్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇటీవలే కీరన్‌ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కొత్త కెప్టెన్‌ ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై విండీస్‌ క్రికెట్‌ బోర్డు పలు దఫాలు చర్చలు జరిపింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ పూరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

కాగా నికోలస్‌ పూరన్‌ ఐసీసీ టి20 ప్రపంచకప్‌ 2022తో పాటు, 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు విండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడు. ఇక షెయ్‌ హోప్‌ను వన్డే వైస్‌కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు విండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఇక పూరన్‌ 2016లో విండీస్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.  విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పూరన్‌ 37 వన్డేల్లో 1,121 పరుగులు, 57 టి20ల్లో 1193 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలు సాధించిన పూరన్‌.. టి20 క్రికెట్‌లో 8 అర్థసెంచరీలు సాధించాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న పూరన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పూరన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ మెగావేలంలో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన రేటుకు న్యాయం చేస్తున్న పూరన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.

చదవండి: Kohli-Viv Richards: విండీస్‌ దిగ్గజానికి క్లిష్ట పరిస్థితి.. కోహ్లి త్యాగం!

మరిన్ని వార్తలు