Nicholas Pooran: 'ఒక్క సీజన్‌ మాత్రమే చెత్తగా ఆడాను.. నేనేంటో చూపిస్తా'

20 Mar, 2022 12:20 IST|Sakshi

వెస్టిండీస్‌ హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌ ఐపీఎల్‌ 2022 సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే జరిగిన మెగావేలంలో పూరన్‌ను రూ. 10.75 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది. గతేడాది ఇదే పూరన్‌ పంజాబ్‌ కింగ్స్‌ తరపున పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఒకటో రెండో మంచి ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి అవి జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో మెగావేలానికి ముందు పంజాబ్‌ పూరన్‌ను రిలీజ్‌ చేసింది.

కట్‌చేస్తే మెగావేలంలో విండీస్‌ ప్లేయర్లలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. అసలు పూరన్‌కు ఇంత ధర ఎందుకని ఎస్‌ఆర్‌హెచ్‌ను విమర్శించినప్పటికి.. ఇటీవలే వెస్టిండీస్‌తో టీమిండియా టి20 సిరీస్‌ ఆడిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో పూరన్‌ మంచి ప్రదర్శనే కనబరిచాడు. ఈ దెబ్బతో ఎస్‌ఆర్‌హెచ్‌ తనను కొనుగోలు చేయడం సరైందేనని నిరూపించాడు. మరో ఆరు రోజుల్లో ఐపీఎల్‌ 15వ సీజన్‌ మొదలుకానున్న నేపథ్యంలో పూరన్‌ ఈఎస్‌పీఎన్‌తో మాట్లాడాడు.

''ఒక సీజన్‌ చెత్తగా ఆడినంత మాత్రానా నా ఆటలో ఎలాంటి మార్పు రాదు. ప్రతీ ఆటగాడికి ఒక బ్యాడ్‌టైం నడుస్తోంది. గత ఐపీఎల్‌ సీజన్‌తో పాటు టి20 ప్రపంచకప్‌ వరకు ఆ బ్యాడ్‌ టైం నడిచిందనుకుంటా. ఆ తర్వాత ఇంగ్లండ్‌, టీమిండియాలతో జరిగిన టి20 సిరీస్‌ల్లో రాణించి ఫామ్‌లోకి వచ్చాను. నాపై నమ్మకముంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏదైనా చేయాలి. అది నా బ్యాటింగ్‌ రూపంలో వారికిస్తే సంతోషంగా ఉంటుంది. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. అందుకే ఇప్పుడు నా దృష్టంతా ఐపీఎల్‌ 2022 పైనే పెట్టా.

గత ఐపీఎల్‌ సీజన్‌ నుంచి చాలా పాఠాలే నేర్చుకున్నా. ఆ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో డకౌట్‌ కావడం.. ఆ తర్వాతి మ్యాచ్‌లో గోల్డెన్‌ రనౌట్‌ కావడం బాధించింది. వాటిని తిరిగి చూడకూడదని అనుకుంటున్నా. నా బ్యాటింగ్‌ టెక్నిక్స్‌లో పలు మార్పులు చేసుకున్నా.  ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడంలో నాకు ఎక్కువ కంఫర్ట్‌ ఉంటుంది. మరి ఎస్‌ఆర్‌హెచ్‌లో నేను ఏ స్థానంలో వస్తాననేది చెప్పడం కష్టమే.

కానీ మూడో స్థానంతో పోలిస్తే నాలుగు, ఐదు స్థానాలు నాకు కాస్త కష్టంగా ఉంటాయి. ఓపెనర్లు తొందరగా ఔటైతే.. ఆ బాధ్యత వన్‌డౌన్‌ బ్యాటర్‌పై పడుతుంది. దానిని నేను ఎక్కువగా ఇష్టపడుతాను.. ఎందుకంటే అప్పుడు బ్యాటింగ్‌లో రాణించడానికి ఎక్కువ స్కోప్‌ ఉంటుంది. కచ్చితంగా అంచనాలను అందుకుంటా'' అని పూరన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

చదవండి: IPL 2022: సీఎస్‌కే స్టార్‌ ఆల్‌రౌండర్‌కు వీసా సమస్య.. తొలి మ్యాచ్‌కు దూరం!

Kraigg Brathwaite: ఏడు వందల నిమిషాల మారథాన్‌ ఇన్నింగ్స్‌‌.. సాహో విండీస్‌ కెప్టెన్‌

>
మరిన్ని వార్తలు