Nick Kyrgios: 'తెలుసుకొని మాట్లాడితే మంచిది'.. రిఫరీతో దురుసు ప్రవర్తన

16 Jun, 2022 15:43 IST|Sakshi

ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిర్గియోస్‌కు కోపం ఎక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టెన్నిస్‌ స్టార్‌ కోర్టులో సీరియస్‌గా మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో ఎవరైనా గెలికారో ఇక అంతే సంగతులు. తాజాగా నిక్‌ కిర్గియోస్‌ తన కోపాన్ని మరోసారి చూపించాడు. ఏటీపీ 500 హాలే ఓపెన్‌లో బుధవారం రాత్రి నిక్‌ కిర్గియోస్‌, సిట్సిపాస్‌ మధ్య నాలుగో రౌండ్‌ మ్యాచ్‌ జరిగింది.

ఈ మ్యాచ్‌లో కిర్గియోస్‌ 5-7, 6-2, 6-4తో సిట్సిపాస్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరాడు. అయితే మ్యాచ్‌లో రెండో రౌండ్‌ సందర్భంగా సిట్సిపాస్‌ 2-0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కిర్గియోస్‌ సర్వీస్‌ చేయడంలో సమయం ఎక్కువ తీసుకున్నాడు. తనకు సర్వీస్‌ వచ్చిన ప్రతీసారి అదే చేయడంతో లైన్‌ అంపైర్‌(రిఫరీ)..''తొందరగా సర్వీస్‌ చెయ్‌.. నీ వల్ల సమయం వృథా అవుతుంది.. ప్రత్యర్థి ఆటగాడి ఫోకస్‌ దెబ్బ తింటుంది'' అంటూ కిర్గియోస్‌కు వార్నింగ్‌ ఇచ్చాడు.

ఇది విన్న కిర్గియోస్‌కు కోపం నషాళానికి అంటింది. అంపైర్‌వైపు కోపంగా చూస్తూ.. ''నేను టైం వేస్ట్‌ చేయడం లేదు.. కాస్త అలసటగా ఉండడంతో మెళ్లిగా సర్వీస్‌ చేస్తున్నా.. అనే ముందు తెలుసుకొని మాట్లాడితే మంచిది'' అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక క్వార్టర్స్‌లో కిర్గియోస్‌.. కారెన్నోతో తలపడనున్నాడు.

చదవండి: Base Ball Game: అది బేస్‌బాల్‌ గేమ్‌.. ఏమరపాటుగా ఉంటే అంతే సంగతి!

మరిన్ని వార్తలు