భారత్‌ పంచ్‌ అదిరింది

21 Dec, 2020 02:43 IST|Sakshi

ప్రపంచకప్‌ బాక్సింగ్‌ టోర్నీలో తొమ్మిది పతకాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో వచ్చిన విరామం తర్వాత పాల్గొన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. జర్మనీలోని కొలోన్‌ పట్టణంలో ముగిసిన ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. ఈ మెగా టోర్నీలో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు గెల్చుకున్నారు. పురుషుల విభాగంలో అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు)... మహిళల విభాగంలో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు), మనీషా మౌన్‌ (57 కేజీలు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.

అమిత్‌కు ఫైనల్లో తన ప్రత్యర్థి బిలాల్‌ బెన్నమ్‌ (ఫ్రాన్స్‌) నుంచి వాకోవర్‌ లభించగా... సిమ్రన్‌జిత్‌ కౌర్‌ 4–1తో మాయా క్లీన్‌హాన్స్‌ (జర్మనీ)పై, మనీషా 3–2తో భారత్‌కే చెందిన సాక్షిపై గెలుపొందారు. ప్లస్‌ 91 కేజీల విభాగంలో సతీశ్‌ కుమార్‌ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఫైనల్లో సతీశ్‌ తన ప్రత్యర్థి నెల్వీ టియాఫాక్‌ (జర్మనీ)కి వాకోవర్‌ ఇచ్చాడు. సెమీఫైనల్లో ఓడిన సోనియా (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), గౌరవ్‌ (57 కేజీలు), హుసాముద్దీన్‌ (57 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జర్మనీ, బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, మాల్డోవా, నెదర్లాండ్స్, పోలాండ్, ఉక్రెయిన్‌ దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొన్నారు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు