యువీకి బీసీసీఐ నో చెప్పేసినట్లేనా?

11 Sep, 2020 17:04 IST|Sakshi

దుబాయ్‌: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ రీంట్రీ కోసం ఆసక్తి చూపడంపై పంజాబ్‌ రంజీ క్రికెటర్‌, టీమిండియా ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ హర్షం వ్యక్తం చేశాడు. యువరాజ్‌ రీఎంట్రీ అనేది తమ యువ క్రీడాకారులకు ఎంతో లాభిస్తుందన్నాడు.  కచ్చితంగా యువకులతో కూడిన పంజాబ్‌ జట్టుకు యువీ పునరాగమనం ఉపయోగిస్తుందన్నాడు. ‘ పంజాబ్‌కు చెందిన యువ క్రికెటర్లకు యువీ రీఎంట్రీ ఎంతో ఉపయోగంం. మేము గతంలో యువరాజ్‌తో చాలాకాలం ఆటను ఆస్వాదించాం.  అతనితో కలిసి ట్రైనింగ్‌లో పాల్గొన్నాం.  నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాం. ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను షేర్‌ చేసుకున్నాం. ఆన్‌ద ఫీల్డ్‌ విషయాలే కాకుండా ఆఫ్‌ ద ఫీల్డ్‌ విషయాలను కూడా యువరాజ్‌తో పంచుకున్నాం. ఓవరాల్‌గా చూస్తే యువరాజ్‌తో మాది చాలా మంచి అనుభవం’ అని శుబ్‌మన్‌ గిల్‌ తెలిపాడు.(చదవండి: ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్‌)

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ గతేడాది జూన్‌ 10వ తేదీన అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు.  ఇప్పుడు తన రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుని  పంజాబ్ క్రికెట్‌లో డొమస్టిక్‌ లీగ్‌లు ఆడాలని భావిస్తున్నాడు. జట్టులో ఆటగాడిగా ఉంటూనే యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించాలని పంజాబ్‌ క్రికెట్‌ సంఘం.. యువీని కోరడంతోనే అందుకు సుముఖత వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని బీసీసీఐకి యువీ లేఖ రాశాడు.  మరి యువీ విషయంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. విదేశీ లీగ్‌లు ఆడే క్రమంలో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన యువరాజ్‌.. ఇప్పుడు ఇలా యూటర్న్‌ తీసుకోవడాన్ని ఎలా పరిగణిస్తుందో అనేది ఆసక్తికరం. ఇటీవలే తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి బీసీసీఐ కూడా ఒక కారణమని యువీ విమర్శించాడు. అసలు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఎంతోమంది స్టార్‌ క్రికెటర్లకు సరైన గౌరవం దక్కలేదని, ఈ వైఖరిని బీసీసీఐ మార్చుకోవాల్సిన అవసరం ఉందని చురకలు అంటించాడు. కాగా, యువరాజ్‌ రీఎంట్రీ అనేది ఉండకపోవచ్చు అనేది బీసీసీఐలోని అధికారుల ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

బీసీసీఐ నో చెప్పేసినట్లేనా?
సాధారణంగా భారత క్రికెటర్ ఎవరైనా విదేశీ  లీగ్‌లో ఆడాలంటే..? అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కి కూడా రిటైర్మెంట్ ప్రకటించి బీసీసీఐ నుంచి ఎన్‌వోసీని తీసుకోవాలి. అలానే ఒక్కసారి విదేశీ  లీగ్‌లో ఆడిన భారత క్రికెటర్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీసీఐ మళ్లీ తన ఆధ్వర్యంలో జరిగే ఏ టోర్నీలోనూ ఆడేందుకు అనుమతించదు. ఇది బీసీసీఐ నిబంధన. దాంతో యువరాజ్‌ తిరిగి దేశవాళీ క్రికెట్‌ ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తేల్చిచెప్పారు. ‘రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత బీసీసీఐ నుంచి యువరాజ్‌ వన్‌టైమ్‌ బెన్‌ఫిట్‌ అందుకున్నాడు. రూ. 22, 500 పెన్షన్‌ను కూడా గత ఏడాది నుంచి యువీ తీసుకుంటన్నాడు. బీసీసీఐ రికార్డుల్లో యువీ రిటైర్మెంట్‌ చేరిపోయింది. ఫలితంగా బీసీసీఐ నిబంధనలు బోర్డుకు సంబంధించిన రాష్ట్ర అసోసియేషన్‌లో కానీ యువీ తిరిగి ఆడటానికి అనుమతించవు. దీనిపై తుది నిర్ణయం బోర్డుదే’ అని సదరు అధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు