అశ్విన్‌ను అలా చేయనివ్వను!

20 Aug, 2020 06:37 IST|Sakshi

‘మన్కడింగ్‌’పై వారిస్తానన్న క్యాపిటల్స్‌ కోచ్‌ పాంటింగ్‌

న్యూఢిల్లీ: గత ఏడాది ఐపీఎల్‌లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘మన్కడింగ్‌’ ద్వారా జాస్‌ బట్లర్‌ను రనౌట్‌ చేయడం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్‌ ఒకే మాటపై నిలబడగా...అది క్రీడా స్ఫూర్తినికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చాయి. ఈ సారి 2020 ఐపీఎల్‌లో అశ్విన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తరఫున ఆడనున్నాడు.

దానికి హెడ్‌ కోచ్‌గా ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ వ్యవహరిస్తున్నాడు. ఇకపై అలాంటి ఘటన జరగదని, ఈ విషయంలో తాను అశ్విన్‌తో ‘గట్టిగా’ మాట్లాడతానని పాంటింగ్‌ వ్యా ఖ్యానించాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఎలాంటి ఘటనా జరగదని పాంటింగ్‌ హామీ ఇచ్చాడు. ‘మా జట్టు అలాంటి తరహా క్రికెట్‌ను ఆడబోవడం లేదు. నేను అశ్విన్‌ను కలవగానే అన్నింటికింటే ముందు ఇదే విషయంపై మాట్లాడతా. గత ఏడాది అతను మా జట్టుతో లేడు. అశ్విన్‌ అద్భుతమైన బౌలర్‌. ఈ ఘటన జరిగినప్పుడు నేను మా ఆటగాళ్లతో కూడా అది తప్పని చెప్పాను.

అశ్విన్‌లాంటి స్థాయి ఆటగాడు అలా చేస్తే మరికొందరు అతడిని అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అతడిని కలిశాక దీనిపై చర్చిస్తా. నాకు తెలిసి అతను మళ్లీ తన చర్యను సమర్థించుకోవచ్చు. అయితే క్రీడా స్ఫూర్తికి మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. నేను, మా ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ మాత్రం అలాగే భావిస్తాం’ అని పాంటింగ్‌ వివరించాడు. అయితే అశ్విన్‌ తరహాలో ‘మన్కడింగ్‌’ ద్వారా బ్యాట్స్‌మన్‌ను అవుట్‌ చేయడం తప్పేమీ కాదంటూ ఎంసీసీ రూపొందించిన నిబంధనల కమిటీలో పాంటింగ్‌ కూడా సభ్యుడు కావడం విశేషం. మరో వైపు 2008లో సిడ్నీలో భారత్‌తో జరిగిన టెస్టు లో పలు మార్లు క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిన పాంటింగ్, ఇప్పుడు క్రీడా స్ఫూర్తి మాటలు చెప్పడం హాస్యాస్పదమని భారత అభిమానులు అతనిపై విరుచుకు పడ్డారు.  

మరిన్ని వార్తలు