Ind Vs Eng 5th Test: 'ఇంగ్లండ్‌ పిచ్‌లపై అతడి కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు'

1 Jul, 2022 08:58 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ ఆటగాడు  చతేశ్వర్‌ పుజారాపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు చాలా సార్లు భారత జట్టును గెలిపించాడని, అయినప్పటికీ అతడి ఇన్నింగ్స్‌లకు తగిన గుర్తింపు రాలేదని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా అందరూ ఐపీఎల్‌లో ఆడుతున్నప్పడు.. పుజారా మాత్రం ఇంగ్లండ్‌ కౌంటీల్లో అడి తన ఫామ్‌ను తిరిగి పొందాడని అతడు కొనియాడాడు. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను పుజారా ఆరంభించే అవకాశం ఉంది.

"పుజారాకు ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. కౌంటీ క్రికెట్‌లో బౌలర్ల కంటే అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లు మెరుగ్గా ఉండవచ్చని మీరు భావించవచ్చు. కానీ కౌంటీ క్రికెట్‌లో కూడా ఒకరిద్దరు అంతర్జాతీయ బౌలర్లు ఉంటారు. కౌంటీ క్రికెట్‌లో ఆడి పుజారా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. అతడు ఎప్పడూ భారత జట్టుకు తనవంతు సహకారం అందిస్తాడు.

ఇక మేము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు పుజారా అంతగా రాణిస్తాడని ఎవరూ ఊహించలేదు. విదేశాల్లో పర్యటించేటప్పుడు భారత తరపున పుజారా అద్భుతంగా ఆడుతాడు. ఇంగ్లండ్‌ వంటి బౌన్సీ పిచ్‌లపై పుజారాకు పరుగులు సాధించే సత్తా ఉంది. ఇంగ్లండ్‌లో పుజారా కంటే ఎవరూ మెరుగ్గా రాణించలేరు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది కౌంటీల్లో ఐదు ‍టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 700 పరుగులు సాధించాడు.
చదవండిSL vs Aus1st Test: శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్‌: 313/8

మరిన్ని వార్తలు