ప్రేక్షకుల్లేకుండానే... భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌

21 Dec, 2021 05:23 IST|Sakshi
ప్రాక్టీస్‌ సెషన్‌లో కెప్టెన్‌ కోహ్లికి కోచ్‌ ద్రవిడ్‌ సూచనలు

జొహన్నెస్‌బర్గ్‌: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తమ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదని ప్రకటించింది. ఆదివారం నుంచి మొదలయ్యే తొలి టెస్టు సహా మున్ముందు జరిగే ఇతర మ్యాచ్‌లకు కూడా అభిమానుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచడం లేదని సీఎస్‌ఏ వెల్లడించింది. ఇరు జట్ల మధ్య పోరులో భాగంగా 3 టెస్టులు, 3 వన్డేలు జరగనున్నాయి.

నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్‌ తీసుకున్న అభిమాలను గరిష్టంగా 2 వేల మంది వరకు అనుమతించే అవకాశం ఉన్నా... ఆటగాళ్ల భద్రత, బయో బబుల్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎస్‌ఏ, బీసీసీఐ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల తమ దేశంలో శ్రీలంక, పాకిస్తాన్‌లతో జరిగిన సిరీస్‌లను కూడా ప్రేక్షకుల్లేకుండానే సీఎస్‌ఏ నిర్వహించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా ‘ఫోర్త్‌ వేవ్‌’ కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ రోజుకు సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం రెండు టెస్టులకు వేదికలైన సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్‌ నగరాలు ఉన్న గ్వాటంగ్‌ ప్రొవిన్స్‌లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు