న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లు పాక్‌ పర్యటన రద్దు చేసుకోవడంపై మండిపడ్డ ఆసీస్‌ ఓపెనర్‌

24 Sep, 2021 15:45 IST|Sakshi

Usman Khawaja Reacts To New Zealand, England Pulling Out Of Pakistan Tour: భద్రతా కారణాలను బూచిగా చూపి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు పాక్‌ పర్యటనను రద్దు చేసుకోవడంపై ఆస్ట్రేలియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖ్వాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. సరైన ఆధారాలు లేకుండా ఆ రెండు జట్టు అలా చేయడం నిరాశకు గురి చేసిందని అన్నాడు. పాకిస్థాన్‌ పర్యటన కాబట్టి అలా చేశారు.. అదే భారత్‌ పర్యటన అయితే అలా చేయగలరా..? భారత పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకునే ధైర్యం ఏ జట్టుకైనా ఉంటుందా.. అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్‌కు నో చెప్పే పరిస్థితి లేదని, అందుకు కారణం అక్కడున్న డబ్బే అంటూ భారత్‌పై తనకున్న వ్యతిరేక భావాన్ని వ్యక్తపరిచాడు.

ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌ పూర్తయ్యాక తమ జట్టు(ఆసీస్‌) షెడ్యూల్‌ ప్రకారం పాక్‌లో పర్యటిస్తుందని, అందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పాక్‌లో జన్మించిన ఈ ఆసీస్‌ క్రికెటర్‌ పేర్కొన్నాడు. పాక్‌లో సెక్యూరిటీపై ఆయన స్పందిస్తూ.. మిగతా దేశాల్లో ఎలాంటి భద్రత ఉంటుందో పాక్‌లో కూడా అలాగే ఉంటుందంటూ పాక్‌ను వెనకేసుకొచ్చాడు. కొన్ని దేశాల క్రికెటర్లకు పాక్‌తో వారి స్వదేశంలో క్రికెట్‌ ఆడటం ఇష్టముండదని, భారత్‌తో సత్సంబంధాల కారణంగానే వారు అలా ప్రవర్తిస్తుంటారని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. 

కాగా, పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్‌ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్‌ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సైతం తాము పాక్‌లో పర్యటించడం లేదంటూ వెల్లడించింది. ఈ రెండు జట్లు పాక్‌ టూర్‌ను రద్దు చేసుకోవడంతో పాక్‌ క్రికెట్‌ బోర్డుపై తీవ్ర ప్రభావం పడింది. భవిష్యత్తులో విదేశీ జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది.
చదవండి: సన్‌రైజర్స్‌కు బిగ్‌ షాక్‌.. ఇంటి దారి పట్టిన స్టార్‌ ఆల్‌రౌండర్‌

మరిన్ని వార్తలు