గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌పై నిషేధం

20 Feb, 2024 18:11 IST|Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌, ఆఫ్ఘనిస్తాన్‌ యువ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌పై ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20) మేనేజ్‌మెంట్‌ నిషేధం విధించింది.  షార్జా వారియర్స్‌ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ నూర్‌పై 12 నెలల నిషేధం విధిస్తున్నట్లు ILT20 యాజమాన్యం ప్రకటించింది.

నూర్‌కు వారియర్స్ యాజమాన్యం మరో సంవత్సరం కాంట్రాక్ట్‌ పొడిగించినప్పటికీ.. అతను రిటెన్షన్ నోటీసుపై (సీజన్‌ 2 కోసం) సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో ILT20 నూర్‌పై నిషేధం విధించింది. నూర్‌ ఇంటర్నేషనల్ లీగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు మొగ్గు చూపాడు. 

ILT20 క్రమశిక్షణా ఉల్లంఘణ కమిటీ తొలుత నూర్‌పై 20 నెలల నిషేధం విధించింది. అయితే ఒప్పందంపై సంతకం చేసే సమయానికి నూర్‌ మైనర్ కావడంతో అతని నిషేధ కాలాన్ని ఎనిమిది నెలలు తగ్గించి 12 నెలలకు కుదించారు. ఇంటర్నేషనల్ లీగ్ యాజమాన్యం కొద్ది నెలల క్రితం నూర్‌ సహచరుడు, ఆఫ్ఘనిస్తాన్‌ వివదాస్పద బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హాక్‌పై కూడా నిషేధం విధించింది. అతను కూడా నూర్‌ లాగే కాంట్రాక్ట్‌ పొడిగింపు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. 

19 ఏళ్ల నూర్‌.. 2023 ILT20 సీజన్‌లో వారియర్స్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన గుజరాత్‌ టైటాన్స్‌ నూర్‌తో 2023 సీజన్‌కు ముందు 30 లక్షల బేస్‌ ధరకు ఒప్పందం కుదుర్చుకుంది. నూర్‌ 2023 ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు​ పడగొట్టాడు.

whatsapp channel

మరిన్ని వార్తలు