423 రోజుల తర్వాత గ్రౌండ్‌లోకి.. గతం ఒక చీకటి జ్ఞాపకం

23 Feb, 2022 11:34 IST|Sakshi

నార్వేకు చెందిన ఫుట్‌బాలర్‌ ఒమర్ ఎలాబ్దెల్లౌయి జీవితం అందరికి ఆదర్శప్రాయం. మానసికంగా గట్టిదెబ్బ తగిలినప్పటికి తన ఆత్మవిశ్వాసంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. ప్రమాదవశాత్తూ ఒక కన్ను కోల్పోయి 423 రోజుల పాటు తనకు ఇష్టమైన ఆటకు దూరంగా ఉండిపోయాడు. దాదాపు 11 సర్జరీల అనంతరం కంటిచూపు తిరిగి వచ్చింది. తాజాగా మళ్లీ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో అడుగుపెట్టి తన కలను సాకారం చేసుకున్నాడు.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

డిసెంబర్‌ 31,2020.. న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా ఒమర్‌ తనవాళ్లతో క్రాకర్స్‌ కాలుస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. పొరపాటున ఒక క్రాకర్‌ అతని కంట్లోకి దూసుకెళ్లింది. అంతే నొప్పితో విలవిల్లలాడిన ఒమర్‌.. ''నేను చూడలేకపోతున్నా'' అంటూ పక్కనున్న వాళ్లతో చెప్పాడు. వెంటనే ఓమర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఎడమ కన్ను బాగా దెబ్బతిందని.. కంటిచూపు రావడం కష్టమేనని వైద్యులు పేర్కొన్నారు.

దీంతో ఒమర్‌ ఎలాబ్దెల్లౌయి ఫుట్‌బాల్‌ కెరీర్‌ అర్థంతరంగా ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ ఒమర్‌ మనసు అందుకు అంగీకరించలేదు. ఎంత కష్టమైన సరే మళ్లీ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో అడుగుపెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కంటిచూపు కోసం ఎంతో మంది స్పెషలిస్టులను కలిశాడు. చివరగా ఫిబ్రవరి 2021లో సిన్సినాటి ఐ ఇన్‌స్టిట్యూట్‌ డాక్టర్‌ ఒమర్‌కు చిన్న ఆశ కలిగించాడు. ఎడమ కంటిలో స్టెమ్‌ సెల్స్‌ దెబ్బతిన్నాయని.. కార్నియాకు ఏం కాలేదని చెప్పాడు. సర్జరీ చేస్తే కంటిచూపు వచ్చే అవకాశముందని పేర్కొన్నాడు. ఒమర్‌ కంటికి సరిపోయే స్టెమ్‌ సెల్స్‌ లభిస్తే.. కాస్త రిస్క్‌ అయినా ఫలితం వస్తుందని సదరు డాక్టర్‌ పేర్కొన్నాడు.

ఇక్కడే ఒమర్‌కు అదృష్టం తగిలింది. తన కంటికి కరెక్ట్‌గా సరిపోయే స్టెమ్‌ సెల్స్‌ దొరకడంతో సర్జరీ విజయవంతమైంది. దాదాపు 11 సర్జీరీల అనంతరం ఒమర్‌కు కంటిచూపు వెనక్కి వచ్చింది. ఆ తర్వాత మరో ఏడాదిపాటు ఇంట్లోనే ఉండి తన కంటిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అలా మొత్తానికి 423 రోజుల విరామం అనంతరం మళ్లీ ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. గోజ్టేపేతో జరిగిన మ్యాచ్‌లో  గలతసరాయ్ తరపున బరిలోకి దిగిన ఒమర్‌ 90 నిమిషాల పాటు మ్యాచ్‌ ఆడాడు. మ్యాచ్‌లో గలతసరాయ్ 3-2 తేడాతో విజయం సాధించి ఒమర్‌కు కానుకగా ఇచ్చారు. కాగా మ్యాచ్‌లో ఒమర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం.. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: Virat Kohli: అత్యంత పాపులర్‌ ఆటగాడిగా అరుదైన గౌరవం

Munich Air Disaster: ఫిబ్రవరి 6, 1958.. ఫుట్‌బాల్‌ చరిత్రలో అతి పెద్ద విషాదం

>
మరిన్ని వార్తలు