Wrestlers Protest: ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటా

1 Jun, 2023 02:22 IST|Sakshi
రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, సంగీత ఫొగాట్, వినేశ్‌ ఫొగాట్, సాక్షి మలిక్‌

బ్రిజ్‌భూషణ్‌ కేసుపై ఢిల్లీ పోలీసుల వివరణ

త్వరలోనే నివేదిక ఇస్తామని వెల్లడి  

న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు సంబంధించి భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌పై నమోదైన కేసు వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు స్పష్టతనిచ్చారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని వారు వెల్లడించారు. ‘మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల విషయంలో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు’ అని పోలీసులు చెప్పినట్లుగా బుధవారం ఉదయం వార్తలు వచ్చాయి. దాంతో కాస్త గందరగోళం నెలకొంది. దాంతో పోలీసులు ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు.

‘ఆ వార్తలు పూర్తిగా తప్పు. చాలా సున్నితమైన ఈ కేసు విషయంలో అంతే జాగ్రత్తగా విచారణ జరుపుతున్నాం. తాజా పరిస్థితిపై కోర్టుకు సమాచారం ఇస్తూనే ఉన్నాం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూనే ఉంది కాబట్టి నివేదిక కోర్టుకు సమర్పించక ముందు బహిరంగంగా వెల్లడి చేయడం సరైంది కాదు’ అని పోలీసులు స్పష్టం చేశారు.

తాజా పరిణామాల్లో దేశంలోని వేర్వేరు రాజకీయ పార్టీలు రెజ్లర్లకు మద్దతు ప్రకటించాయి. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెజ్లర్లకు న్యాయం చేయాలంటూ స్వయంగా ప్లకార్డ్‌ పట్టి ర్యాలీలో పాల్గొనగా... బ్రిజ్‌భూషణ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు.

బేటీ బచావా, బేటీ పడావో మాత్రమే కాదు...ఇకపై బీజేపీ నాయకుల నుంచి ఆడబిడ్డలను కాపాడుకోవాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ‘బేటీ బీజేపీ కే నేతావోంసే బచావో’ అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చింది. మరోవైపు మంగళవారం హరిద్వార్‌లో గంగలో పతకాలు వేయాలని సంకల్పించిన ఆ తర్వాత మనసు మార్చుకున్న రెజ్లర్లు స్వస్థలం హరియాణా చేరుకోగా, సాక్షి మలిక్‌ మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయింది. తీవ్ర బాధలో ఉండటంతో పాటు మౌనంగా ఉండాలని ఒట్టేసుకోవడం వల్లే మంగళవారం వారు ఎవరితో మాట్లాడలేదని సన్నిహితులు వెల్లడించారు.  

తీవ్ర చర్యలకు పాల్పడవద్దు: ఠాకూర్‌
క్రీడల గొప్పతనాన్ని తగ్గించే ఎలాంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రెజ్లర్లకు సూచించారు. విచారణ పూర్తయ్యే వరకు కాస్త ఓపిక పట్టమని ఆయన కోరారు. మరోవైపు ఆదివారం భారత రెజ్లర్ల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రెజ్లర్లను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన   దృశ్యాలు కలిచివేసే విధంగా ఉన్నాయని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది.

‘ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటా’
కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు రుజువైతే ఉరి వేసుకుంటానని బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ మరోసారి చెప్పారు. ‘వారు నాపై ఆరోణలు చేసి నాలుగు నెలలైంది. ఒక్కదానినీ రుజువు చేయలేకపోయారు. నాకు ఉరిశిక్ష విధించాలని వారు కోరారు. గంగలో పతకాలు వేయడం ద్వారా నన్ను శిక్షించలేరు.

సాక్ష్యాలుంటే కోర్టుకు ఇచ్చి నాకు ఉరిశిక్ష వేయించండి. నా బిడ్డల్లాంటివారైన  రెజ్లర్లపై నాకు ఇప్పటికీ కోపం లేదు’ అని ఆయన అన్నారు. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేసిన మైనర్‌ రెజ్లర్‌ వివరాలు బహిర్గతం చేసిన ఆమె బంధువు ఒకరిపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ స్వాతి మలివాల్‌ పోలీసులకు సూచించింది. 

మరిన్ని వార్తలు