అస్తమించిన క్రీడా దిగ్గజం..

19 Mar, 2021 14:20 IST|Sakshi
అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంటున్న శ్రీనివాస్‌రావు (ఫైల్‌) ఇన్‌సెట్లో శ్రీనివాస్‌రావు (ఫైల్‌)

అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాస్‌రావు మృతి

వైకల్యాన్ని అధిగవిుంచిన విజేత

రాష్ట్రం నుంచి అర్జున పురస్కారం పొందిన తొలి పారా అథ్లెట్‌

సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు

సాక్షి, కరీంనగర్‌ ‌: దివ్యాంగ క్రీడాకారులకు ఆయన ఓ స్ఫూర్తి.. ఆదర్శం. దివ్యాంగుడైనా పట్టుదల.. సడలని ఆత్మవిశ్వాసం.. మనోధైర్యంతో ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచాడు. ఆటే శ్వాసగా ప్రతీ పోటీలో పతకాలు సాధిస్తూ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఆయన క్రీడా ప్రతిభ ముందు వైకల్యం తలవంచింది. చివరికి క్యాన్సర్‌తో ఆయన సాగించిన పోరాటంలో పరాజితుడై తుది శ్వాస విడిచాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లికి చెందిన అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాస్‌రావు(67) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. కార్సినోమా క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస వదిలారు.

స్వగ్రామంలో అంత్యక్రియలు..
శ్రీనివాసరావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లిలో క్రీడాభిమానుల అశ్రునయనాల మధ్య గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్‌రావు మృతదేహం వద్ద సర్పంచ్‌ వీరగోని సుజాత, ఎంపీటీసీ పులి అనూష నివాళులర్పించారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు, రోహిత్, రోహన్, కూతురు ధృవి ఉన్నారు. మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్‌రావు వృత్తి రీత్యా ఆర్టీసీలో మెకానిక్‌గా చేరారు. ఉత్తమ దివ్యాంగ ఉద్యోగిగా 1994లో జాతీయ స్థాయి అవార్డును అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్‌ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. దివ్యాంగుల జాతీయ క్రీడా సంఘానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పారా స్పోర్ట్స్‌ సంఘం ఏర్పాటు చేశారు.

2003లో అర్జున అవార్డు..
1996లో లండన్‌లో జరిగిన దివ్యాంగుల ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించారు. 2002లో బెంగళూరులో జరిగిన వరల్డ్‌ పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించారు. దీంతో భారత ప్రభుత్వం 2003లో అర్జున అవార్డు ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి పారా అథ్లెట్ల విభాగంలో అర్జున పురస్కారాన్ని పొందిన తొలి శ్రీడాకారుడిగా రికార్డ్‌ సాధించారు. 2010లో చైనాలోని గ్వాంగ్‌ జూలో జరిగిన ఏసియన్‌ పారా ఫెన్సింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2004లో మలేసియాలో జరిగిన మెన్స్‌ డబుల్స్‌ ఏసియన్‌ పారా బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం, 2006లో ఇజ్రాయిల్‌లో జరిగిన సింగిల్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్యం, 2010లో ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బ్యాటన్‌ రిలేలో ప్రతిభ కనబరిచారు. 2006 నుంచి ముంబయి మారథాన్‌ రన్‌లో వరుసగా పాల్గొన్నారు. చివరగా 2018లో బెంగళూర్‌ జరిగిన రన్‌లో పాల్గొని కాంస్య పతకం సాధించారు.

వైఎస్సార్‌ పాదయాత్రలో..
దివంగత సీఎం వైఎస్సార్‌ జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో ఆయనతో కలిసి అడుగులు వేశారు. జమ్మికుంట నుంచి పరకాల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అర్జున అవార్డు అందుకున్న మాదాసు కు అప్పటి ఏపీ సీఎం వైఎస్సార్‌ రూ.లక్ష నజరానా అందించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం దివ్యాంగ స్ఫూర్తి అవార్డు ప్రదానం చేసింది.

ఇంటి స్థలం కోసం..
అర్జున అవార్డు గ్రహీతలకు ప్రభుత్వాలు ఇంటి స్థలాలివ్వడం పరిపాటి. తిమ్మాపూర్‌ సమీపంలో తనకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని ప్రభుత్యాలను విన్నవించినా నేటికీ కేటాయింపులు జరగలేదు. పద్మశ్రీ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం గమనార్హం. 2004లో జిల్లా కేంద్రంలో మాదాసు శ్రీనివాస్‌రావు కాలనీని ఏర్పాటు చేసింది. తన అంతర్జాతీయ ప్రతిభతో ఎంతోమంది దివ్యాంగులు క్రీడల్లో భాగస్వాములను చేస్తూ వారికి స్ఫూర్తినిచ్చారు. దీంతో అంజనారెడ్డి, రఘురాం వంటి దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు.

శ్రీనివాస్‌రావు మృతదేహానికి నివాళులరి్పస్తున్న సర్పంచ్‌ సుజాత

మరిన్ని వార్తలు