French Open: ‘కింగ్‌’కు చెక్‌

13 Jun, 2021 02:15 IST|Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ పరాజయం

స్పెయిన్‌ స్టార్‌ను మట్టికరిపించిన జొకోవిచ్‌

అద్భుత సమరంలో పైచేయి సాధించిన వరల్డ్‌ నంబర్‌వన్‌

నేడు సిట్సిపాస్‌తో ఫైనల్‌ పోరు

సాయంత్రం గం. 6:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 టైటిల్స్‌... 105 విజయాలు... కేవలం 2 మ్యాచ్‌లలో ఓటమి... ఆ గడ్డపై అతడిని ఓడించడం సంగతి దేవుడెరుగు... అలాంటి ఆలోచన రావడం కూడా ఒక సాహసమే. కానీ ఎర్రమట్టిపై ఎదురులేని రారాజు ఎట్టకేలకు ‘జోకర్‌’ జోరుకు తలవంచాడు. అద్భుతమైన ఆట, పక్కా ప్రణాళికతో చెలరేగిన నొవాక్‌ జొకోవిచ్‌ ... ‘క్లే కింగ్‌’ రాఫెల్‌ నాదల్‌పై రొలాండ్‌ గారోస్‌లో రెండోసారి విజయం సాధించి సత్తా చాటాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 14వ ట్రోఫీతో పాటు అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ (21)ల విజయాన్ని అందుకోవాలని భావించిన నాదల్‌ ప్రయాణం సెమీస్‌లో ఆగిపోగా... 19వ గ్రాండ్‌స్లామ్‌ వేటకు వరల్డ్‌ నంబర్‌వన్‌ సన్నద్ధమయ్యాడు. తుది ఫలితం ఎలా ఉన్నా టెన్నిస్‌ చరిత్రలో అద్భుత మ్యాచ్‌లలో ఒకటిగా ఈ పోరు నిలిచిపోయింది.

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అత్యంత అరుదుగా కనిపించే ఘట్టం శుక్రవారం అర్ధరాత్రి  దాటాక     ఆవిష్కృతమైంది. ప్రత్యర్థి ఎవరైనా ఎర్ర మట్టి కోర్టులో విరుచుకుపడే రాఫెల్‌ నాదల్‌కు టోర్నీ సెమీఫైనల్లో ఓటమి ఎదురైంది. 4 గంటల 11 నిమిషాల పాటు సాగిన పోరులో జొకోవిచ్‌ (సెర్బియా) 3–6, 6–3, 7–6 (7/4), 6–2తో మూడో సీడ్‌ నాదల్‌ను బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ను రెండుసార్లు ఓడించిన (2015 క్వార్టర్‌ ఫైన ల్లో) ఏకైక ఆటగాడిగా జొకోవిచ్‌ నిలవగా... ‘స్పెయిన్‌ బుల్‌’కు మరో ఓటమి సోడెర్లింగ్‌ (స్వీడన్‌–2009 ప్రిక్వార్టర్స్‌) చేతిలో ఎదురైంది.  

హోరాహోరీ...
తొలి సెట్‌ను నాదల్‌... రెండో సెట్‌ను జొకోవిచ్‌ నెగ్గగా... మూడో సెట్‌లో ఇద్దరూ ఒక్కో పాయింట్, గేమ్‌ కోసం తీవ్రంగా శ్రమించారు. టెన్నిస్‌ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని గొప్ప ఆటను ఇద్దరూ చూపించారు. సర్వీస్‌లు నిలబెట్టుకుంటూ వెళ్లిన అనంతరం బ్రేక్‌ సాధిం చిన జొకోవిచ్‌ ఒక దశలో 5–3తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే నాదల్‌ తగ్గలేదు. పోరాటపటిమ ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 6–5తో ముందంజ వేశాడు. దురదృష్టవశాత్తూ ఇక్కడ నాదల్‌ మంచి అవకాశాన్ని కోల్పోయాడు. సెట్‌ పాయింట్‌ కోసం సర్వ్‌ చేసిన అతను డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. టైబ్రేక్‌లో జొకోవిచ్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. 93 నిమిషాల్లో జొకోవిచ్‌ మూడో సెట్‌ గెలుచుకున్నాడు. నాలుగో సెట్‌ ఆరంభంలోనే బ్రేక్‌ సాధించిన నాదల్‌ 2–0తో ఆధిక్యంలో నిలిచినా... ఆ తర్వాత జొకోవిచ్‌ చెలరేగిపోయాడు. వరుసగా ఆరు గేమ్‌లు నెగ్గి నాదల్‌ 14వ టైటిల్‌ ఆశలను సెమీస్‌లోనే ముగించాడు.   

పారిస్‌ ఆగిపోయింది...
నాదల్, జొకోవిచ్‌ మ్యాచ్‌ కోసం ప్రభుత్వ అధికారులు కూడా కరోనా నిబంధనల నుంచి సడలిం పునిచ్చారు. పారిస్‌లో రాత్రి 11 గంటల నుంచి కర్ఫ్యూ ఉండటంతో 10:30కే అభిమానులు స్టేడి యం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఉన్నా యి. అయితే ఆ సమయంలో మ్యాచ్‌ ఉత్కంఠభరిత స్థితిలో ఉంది. ప్రేక్షకులు కాస్త నిరాశగా కనిపిస్తున్న దశలో మ్యాచ్‌ ముగిసే వరకు ఉండవచ్చంటూ అధికారులు ప్రకటించడం విశేషం.     నేడు జరిగే పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో జొకోవిచ్‌ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్‌ 5–2తో సిట్సి పాస్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. గత ఏడాది ఈ టోర్నీ సెమీఫైనల్లో ఐదు సెట్‌ల పోరాటంలో సిట్సిపాస్‌పై జొకోవిచ్‌ గెలిచాడు.

మూడో సెట్‌లో నేను సెట్‌ పాయింట్‌ కోల్పోవడం మ్యాచ్‌లో కీలక మలుపు. డబుల్‌ ఫాల్ట్‌ చేయడంతో పాటు టైబ్రేక్‌లో సులువైన వాలీలు ఆడలేకపోయాను. అయితే ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు. ఇలాంటి తప్పలు సహజం. కానీ మ్యాచ్‌లు గెలవాలంటే ఇలాంటి తప్పులే చేయరాదు. నేను నా అత్యుత్తమ ఆటతీరు కనబర్చి పోరాడాను. కానీ ఈ రోజు నాది కాదు.
–రాఫెల్‌ నాదల్‌

నాదల్‌కు ప్రత్యర్థిగా మైదానంలోకి దిగుతున్నప్పుడే అతడిని ఇక్కడ ఓడించాలంటే  ఎవరెస్ట్‌ ఎక్కినంత శ్రమించాలనే విషయం నాకు తెలుసు. రొలాండ్‌ గారోస్‌లో ఇది నా అత్యుత్తమ మ్యాచ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా కెరీర్‌లో బెస్ట్‌–3లో ఇదొకటి. గత 15 ఏళ్లుగా ఈ కోర్టును శాసిస్తున్న వ్యక్తిని ఓడించడం ఎప్పటికీ ప్రత్యేకం. నేను శారీరకంగా, మానసికంగా చాలా అద్భుతంగా ఉండటంతో పాటు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగా. గత ఏడాది ఫైనల్‌కంటే మెరుగ్గా ఆడాలంటే ఏం చేయాలనేదానిపై స్పష్టమైన వ్యూహాలతో ఉన్నా. అందుకే తొలి సెట్‌ ఓడినా ఆందోళన చెందలేదు. 
–జొకోవిచ్‌

మరిన్ని వార్తలు