జొకో కేసు గెలిచాడు... కానీ ఆట ముగిసిపోలేదు

11 Jan, 2022 02:52 IST|Sakshi

వీసా పునరుద్ధరించాలని కోర్టు ఆదేశం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి 21వ గ్రాండ్‌స్లామ్‌ సొంతం చేసుకునేందుకు వచ్చిన ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ముందుగా ప్రభుత్వంపై కోర్టు కేసు గెలిచాడు. వ్యాక్సినేషన్‌పై వైద్యపరమైన మినహాయింపు ఇచ్చాకే వచ్చిన ఆటగాడి నిలిపివేత, బహిష్కరణ సరి కాదన్న ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టు... తక్షణం నిర్బంధ క్వారంటైన్‌ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. రద్దు చేసిన వీసాను పునరుద్ధరించాలని న్యాయమూర్తి ఆంథోని కెల్లీ తన తీర్పులో వెల్లడించారు. మినహాయింపు కోసం జొకోవిచ్‌ కావాల్సిన పత్రాలన్నీ సమర్పించాడని...ఇంకా ఏం చేయాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆట ముగిసిపోలేదు...
అయితే ఇక్కడితో సెర్బియన్‌ స్టార్‌కు ఊరట లభిం చినట్లేనని సంతోషించడానికి వీల్లేదు. ఫెడరల్‌ కోర్టు తీర్పుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ ఆడటం ఇంకా ఖాయం కాలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం వీసాను రెండోసారి రద్దు చేసే విశేషాధికారం ప్రభుత్వానికే ఉంది. ఒక వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం తమపై కోర్టుకెక్కిన జొకోవిచ్‌పై ప్రతిష్టకు పోయి వీసాను రెండోసారి రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే సెర్బియన్‌ చేయగలిందేమీ లేదు! 

మరిన్ని వార్తలు