French Open 2022: మూడో రౌండ్‌లోకి నొవాక్‌ జొకోవిచ్‌

26 May, 2022 08:02 IST|Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 6–2, 6–3, 7–6 (7/4)తో అలెక్స్‌ మొల్కాన్‌ (స్లొవేకియా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 10 ఏస్‌లు సంధించాడు.

మరోవైపు మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 3 గంటల 36 నిమిషాల్లో 2–6, 4–6, 6–1, 6–2, 7–5తో సెబాస్టియన్‌ బేజ్‌ (అర్జెంటీనా)పై, ఆరో సీడ్‌ కార్లోస్‌ అల్కారజ్‌ (స్పెయిన్‌) 4 గంటల 34 నిమిషాల్లో 6–1, 6–7 (7/9), 5–7, 7–6 (7/2), 6–4తో అల్బర్ట్‌ రామోస్‌ వినోలస్‌ (స్పెయిన్‌)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌)–హంటర్‌ రీస్‌ (అమెరికా) ద్వయం 7–6 (7/4), 6–3తో అల్ట్‌మెర్‌–ఆస్కార్‌ ఒటి (జర్మనీ) జోడీపై నెగ్గింది.  

నాలుగో సీడ్‌ సాకరి ఓటమి 
మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండు సంచలనాలు నమోదయ్యాయి. నాలుగో సీడ్, గత ఏడాది సెమీఫైనలిస్ట్‌ మరియా సాకరి (గ్రీస్‌), గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, 12వ సీడ్‌ ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌) రెండో రౌండ్‌లో నిష్క్రమించారు. కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7–6 (7/5), 7–6 (7/4)తో సాకరిపై, అలెగ్జాండ్రా సాస్నోవిచ్‌ (రష్యా) 3–6, 6–1, 6–1తో రాడుకానుపై గెలుపొంది మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.

చదవండి: R Praggnanandhaa: భారత యంగ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద పెను సంచలనం..

మరిన్ని వార్తలు