Novak Djokovic: నేనింతే... టీకా తీసుకోను.. అవసరమైతే..

16 Feb, 2022 05:20 IST|Sakshi

లండన్‌: ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్‌ టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ వ్యాక్సినేషన్‌పై తన కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీకా తీసుకునే ప్రసక్తేలేదని, ఇది తప్పనిసరంటే ఏ మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని, గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలకు దూరమైనా సరేనని ‘బీబీసీ’ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఇంకా జొకోవిచ్‌ ఏమన్నాడంటే... ‘వ్యాక్సినేషన్‌పై స్వేచ్ఛ ఉండాల్సిందే.

నా శరీరానికి ఏది అవసరమో అందరికంటే నాకే బాగా తెలుసు. కోవిడ్‌ వ్యాక్సిన్‌పై నాకు పూర్తి అవగాహన ఉంది. నా వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించే నేను టీకా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా నిర్ణ యం వల్ల కలిగే పర్యావసనాలు తెలుసు. దీనివల్ల ఎన్నో టోర్నీలకు దూరంకావోచ్చు. అయినా సరే నా నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఇలా ఏ టోర్నీకి అనుమతించకపోయినా, ఆడనివ్వకపోయినా సరే అన్నింటికి సిద్ధం.  నా శరీరం కోసం నేను తీసుకునే నిర్ణయం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఏ టైటిల్‌ ఎక్కువా కాదు. అయితే చాలామంది నేను వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకినని భావిస్తున్నారు. ఇది సరికాదు. టీకా వద్దనే హక్కూ సదరు వ్యక్తికి ఉండాలని అంటున్నాను తప్ప టీకా వ్యతిరేకిని కాదు. అలాంటి ఉద్యమానికి మద్దతివ్వలేదు. మాట్లాడిందీ లేదు’ అని జొకోవిచ్‌ వివరించాడు.

మరిన్ని వార్తలు