Novak Djokovic: జొకోవిచ్‌కు భారీ షాకిచ్చిన కోర్టు.. మూడేళ్ల పాటు నో ఎంట్రీ!

16 Jan, 2022 13:37 IST|Sakshi

సెర్బియన్‌ టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీసా అంశంలో ఆస్ట్రేలియా కోర్టులో అతడికి చుక్కెదురైంది. దీంతో టైటిల్‌ నిలబెట్టుకోవాలన్న జొకోవిచ్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా ఆస్ట్రేలియా ఓపెన్‌ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో అతడు ఆస్ట్రేలియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకో వీసాను రద్దు చేసింది.

అయితే, అతడు కోర్టుకెక్కి విజయం సాధించాడు. కానీ ప్రభుత్వం మాత్రం తమకున్న అధికారాలతో మరోసారి వీసాను రద్దు చేసింది. దీంతో జొకో రెండోసారి కోర్టును ఆశ్రయించాడు. కానీ.. ఈసారి మాత్రం అతడికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వీసాను రద్దు చేశామన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్‌ పత్రాలు సమర్పించడంలో విఫలం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దీంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకో.. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆడకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన జొకోవిచ్‌.. ‘‘తీవ్ర నిరాశకు గురయ్యాను. అయితే, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను దేశాన్ని వీడటానికి అధికారులు చేస్తున్న ఏర్పాట్లకు సహకరిస్తాను’’ అని పేర్కొన్నాడు. కాగా... రెండోసారి వీసా రద్దు అయిన కారణంగా... జొకో మళ్లీ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టడానికి వీలుండదు. అంటే 2025 వరకు అతడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడే అవకాశం లేనట్లే!

చదవండి: జొకోవిచ్‌ లడాయి
కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ఇలా ముందుగానే.. నాకిది అనుభవమే.. టీమిండియా మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు!

A post shared by Novak Djokovic (@djokernole)

మరిన్ని వార్తలు